Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : విమానం

By:  Tupaki Desk   |   9 Jun 2023 6:28 PM GMT
మూవీ రివ్యూ : విమానం
X
'విమానం' మూవీ రివ్యూ
నటీనటులు: సముద్రఖని-అనసూయ-ధనరాజ్-రాహుల్ రామకృష్ణ-మీరా జాస్మిన్ తదితరులు
సంగీతం: చరణ్ అర్జున్
ఛాయాగ్రహణం: వివేక్ కాలెపు
మాటలు: హను రావూరి
నిర్మాణం: కిరణ్ కొర్రపాటి-జీ స్టూడియోస్
రచన-దర్శకత్వం: శివప్రసాద్ యానాల

హృద్యమైన ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమా.. విమానం. తమిళ నటుడు సముద్రఖని తెలుగులో లీడ్ రోల్ చేసిన తొలి చిత్రమిది. అనసూయ ఓ ముఖ్య పాత్రలో నటించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చేలా ఉందో తెలుసుకుందాం పదండి.


కథ:

వికలాంగుడైన వీరయ్య (సముద్రఖని) హైదరాబాద్ లోని బేగంపేట దగ్గర ఒక బస్తీలో నివాసం ఉంటాడు. అతడి భార్య కొడుకుని చనిపోగా.. ఒక సులభ్ కాంప్లెక్స్ నడిపిస్తూ సొంత కాళ్లపై బతుకుతున్న వీరయ్యకు తన కొడుకు రాజు (మాస్టర్ ధ్రువన్) అంటే ప్రాణం. ఆ కొడుక్కి విమానం అంటే పిచ్చి. నిత్యం విమానం గురించే మాట్లాడుతుంటాడు. దాన్ని చూసినపుడల్లా ఉద్వేగానికి గురవుతుంటాడు. మంచి చదువరి అయిన అతడికి సైనిక్ స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుంది. అక్కడ కొడుకుని చదివించి తనకిష్టమైన విమానాలను నడిపించే పైలట్ గా చేయాలని వీరయ్య అనుకుంటాడు. కానీ అంతలోనే అతడికి గుండె పగిలే వార్త తెలుస్తుంది. తన కొడుక్కి లుకేమియా అని.. నెల రోజుల్లోనే చనిపోతాడని వెల్లడవుతుంది. ఈ స్థితిలో తన కొడుకును ఒక్కసారి విమానం ఎక్కించాలని ఆశపడతాడు వీరయ్య. మరి అతడి ప్రయత్నం ఫలించిందా లేదా అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:

త‌మిళంలో.. మ‌ల‌యాళంలో చిన్న చిన్న పాయింట్లు ప‌ట్టుకుని హృద్య‌మైన సినిమాలు తీస్తుంటారు. తెలుగ‌మ్మాయే అయిన ఐశ్వ‌ర్యా రాజేష్ ప్ర‌ధాన పాత్ర పోషించిన కాకా ముట్టై అనే సినిమానే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటే.. ఇందులో పిజ్జా తినాల‌ని ఆశ‌ప‌డే ఇద్ద‌రు బ‌స్తీ పిల్ల‌ల క‌థ ఇది. ఎంత బ‌స్తీ పిల్ల‌లైనా స‌రే.. పిజ్జా తిన‌డం అంత క‌ష్ట‌మా అనుకుంటాం కానీ.. ఆ క‌ష్టాన్ని చాలా క‌న్విన్సింగ్ గా.. అదే స‌మ‌యంలో మ‌న‌సుకు హ‌త్తుకునేలా తెర‌కెక్కించి అవార్డులు రివార్డులు గెలుచుకుంది ఆ చిత్ర బృందం. దాదాపుగా అలాంటి క‌థ‌తోనే ఇప్పుడు తెలుగులో విమానం సినిమా తెర‌కెక్కింది. స‌ముద్ర‌ఖ‌ని.. అన‌సూయ‌.. రాహుల్ రామ‌కృష్ణ‌.. ధ‌న‌రాజ్ లాంటి మంచి కాస్టింగ్ పెట్టుకుని.. విమానం ఎక్కాల‌ని ఆశ‌ప‌డే ఒక చిన్న పిల్లాడి కోరిక‌ను తీర్చ‌డానికి ఓ తండ్రి ప‌డే ఆరాటాన్ని హృద్యంగా తెర‌కెక్కించ‌డానికి ప్ర‌య‌త్నించాడు ద‌ర్శ‌కుడు శివప్రసాద్ యానాల‌. ఐతే ఈ ప్ర‌య‌త్నంలో అత‌ను కొంత‌మేరే స‌ఫ‌ల‌మ‌య్యాడు. ఎంచుకున్న క‌థ‌.. కొన్ని మూమెంట్స్ వ‌ర‌కు బాగున్న‌ప్ప‌టికీ.. బిగువైన‌.. ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం లేక‌పోవ‌డం విమానం చిత్రానికి మైన‌స్ అయింది.

విమానం అంటే ప‌డి చ‌చ్చే పిల్లాడు.. అత‌డికి క్యాన్స‌ర్.. చివ‌రి కోరిక‌గా అత‌డి పేద తండ్రి విమానం ఎక్కాలన్న త‌న కోరిక‌ను నెర‌వేర్చ‌డానికి ప‌డే ఆరాటం.. ఈ పాయింట్ చెబితే ఎవ‌రికైనా హృద‌యం ద్ర‌విస్తుంది. స‌హ‌జంగా భావోద్వేగాలు పండిస్తే.. ప్రేక్ష‌కుల‌ను క‌దిలించ‌డానికి అవ‌కాశం ఉన్న పాయింట్ ను ద‌ర్శ‌కుడు స‌రిగా ఉప‌యోగించుకోలేదు. మ‌రీ నెమ్మ‌దిగా సాగే న‌రేష‌న్ కు తోడు.. ఓవ‌ర్ మెలోడ్రామాతో కూడిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడ‌తాయి విమానంలో. దీనికి తోడు ఏ స‌ర్ప్రైజులు లేకుండా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా సాగిపోయే క‌థాక‌థ‌నాలు కూడా నిరాశ ప‌రుస్తాయి. ఈ సినిమా ఆరంభం చూసే మ‌ధ్య‌మం ఎలా ఉండొచ్చు.. అలాగే ముగింపు ఎలా ఉంటుంది అన్న‌ది ఈజీగా చెప్పేయొచ్చు. అంత ప్రెడిక్ట‌బుల్ సినిమా ఇది. ఐతే స‌న్నివేశాలు బాగుంటే తెలిసిన క‌థ‌లు కూడా ప్రేక్ష‌కుల‌ను కుదురుగా కూర్చోబెడ‌తాయి. కానీ కొన్ని మిన‌హా చాలా వ‌ర‌కు అతి నాట‌కీయతతో కూడిన‌.. అవ‌స‌రం లేని సీన్లు ప్రేక్ష‌కుల‌ను ఇబ్బంది పెడ‌తాయి.

విమానంలో తండ్రీ కొడుకుల ట్రాక్ ఒక్క‌టి హృద్యంగా అనిపిస్తుంది. ఐతే ఆ ట్రాక్ మీద రెండు గంట‌ల సినిమా న‌డిపించ‌డం క‌ష్టం కాబ‌ట్టి వేరే పాత్ర‌లు.. ట్రాక్స్ పెట్టాడు ద‌ర్శ‌కుడు. కానీ అవి చాలా వ‌ర‌కు అన‌వ‌స‌రం అనిపించేవే. ఉదాహ‌ర‌ణ‌కు వేశ్య‌గా అన‌సూయ‌.. ఆమెను కామించే చెప్పులు కుట్టే వ్య‌క్తిగా రాహుల్ రామ‌కృష్ణ.. అత‌డి తాపాన్ని చ‌ల్లార్చ‌డం కోసం అన‌సూయ ఫొటోలు తీసిపెట్టే ఫొటోగ్రాఫ‌ర్ గా మొట్ట రాజేంద్ర‌న్ పాత్ర‌లు.. వీరి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చూస్తే.. ఇలాంటి ఉదాత్త‌మైన సినిమాలో ఇవేం సీన్లు బాబోయ్ అనిపిస్తుంది. ఒక చిన్న పిల్లాడి మీద క‌థ‌ను న‌డిపిస్తూ.. అన‌సూయ ఫొటోలు ఇంటినిండా పెట్టుకుని రాహుల్ చేసే ప‌నుల గురించి చెప్పీ చెప్ప‌కుండా చెప్పిన తీరు చూస్తే జుగుప్సాక‌రంగా అనిపిస్తుంది. ఒక అడ‌ల్ట్ మూవీలో ఆ సీన్లు ఉంటే ఓకే కానీ.. ఈ సినిమాలో మాత్రం అవి ఏమాత్రం సింక్ కాలేదు. చివ‌ర్లో వ‌చ్చే ఒక్క సీన్లో మిన‌హాయిస్తే అన‌సూయ పాత్ర కూడా ఈ క‌థ‌కు అవ‌స‌రం లేద‌నే అనిపిస్తుంది.

చావుకు ద‌గ్గ‌ర‌వుతున్న కొడుకుని విమానం ఎక్కించ‌డానికి తండ్రికి ప‌ది వేలు అవ‌స‌రం అవుతాయి. ఈ రోజుల్లో అయితే ప‌ది వేలు సంపాదించ‌డం పెద్ద క‌ష్టం కాదు. అందుకే ఈ క‌థ‌ కొన్నేళ్లు ముందుకు వెన‌క జ‌రిగిన‌ట్లు చూపించారు. అయినా స‌రే.. కొడుకు కోరిక తీర్చలేక తండ్రి ప‌డే క‌ష్టాలు అంత క‌న్విన్సింగ్ గా అనిపించ‌వు. పైన చెప్పుకున్న కాకా ముట్టై సినిమాలో పిజ్జా తిన‌డానికి కూడా పిల్లలకు సాధ్యం కాకుంటే చిత్రంగా అనిపించ‌దు కానీ.. విమానంలో మాత్రం ప‌ది వేల రూపాయ‌లు సంపాదించ‌లేక ఆ తండ్రి ఇబ్బంది ప‌డుతుంటే కొంచెం అన్ కన్విన్సింగ్ గానే అనిపిస్తుంది. కానీ ఒక‌దాని వెంట ఒక‌టి క‌ష్టాలు వెంటాడుతున్న‌పుడు ఆ తండ్రి ప‌డే మ‌నోవేద‌న‌ను స‌ముద్ర‌ఖ‌ని చూపించిన తీరు.. త‌న న‌ట‌న మాత్రం క‌ట్టిప‌డేస్తాయి. తండ్రీ కొడుకుల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కొన్ని హృద్యంగా అనిపిస్తాయి. ప‌తాక స‌న్నివేశాలు కూడా బాగున్నాయి. కానీ ఈ కొన్ని మూమెంట్స్ మిన‌హాయిస్తే విమానం మ‌రీ నెమ్మ‌దిగా.. ఓవ‌ర్ మెలోడ్రామాతో ఇబ్బంది పెడుతుంది.


నటీనటులు:

సముద్రఖని తెలుగులో చేసిన విలన్ పాత్రల్లో చాలా వరకు రొటీన్. అతను ఎంత మంచి నటుడో తమిళంలో 'విసారణై' లాంటి చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. తెలుగులో అతడి బెస్ట్ పెర్ఫామెన్స్ ,విమానం' చిత్రంలోనే చూడొచ్చు. ఇప్పటిదాకా క్రూరమైన విలన్ పాత్రలు చేయడం వల్ల తనపై పడిపోయిన ఒక ముద్రను ఈ సినిమాతో చెరిపేసుకున్నాడు. తనను చూస్తే జాలి కలిగి కొన్నిచోట్ల హృదయం ద్రవిస్తుంది. అలాంటి ఫీలింగ్ కలిగించాడంటే సముద్రఖని చాలా బాగా నటించినట్లే. దేవుడిని ఎవరైనా ఒక మాట అంటే తిట్టేవాడు.. తనే ఆ దేవుడిని దరిద్రుడా అని తిట్టేంత కోపం తెచ్చుకున్నపుడు సముద్రఖని నటన చూడాల్సిందే. సముద్రఖని కొడుకుగా రాజు పాత్రలో చేసిన చిన్న కుర్రాడు ధ్రువన్ ఆకట్టుకున్నాడు. అతడి ఫ్రెండు పాత్రలో చేసిన పిల్లాడు ఇంకా బాగా చేశాడు. వేశ్య పాత్రలో అనసూయ మెప్పించింది కానీ.. ఆమె మరీ షేపవుట్ అయిపోయినట్లుగా కనిపించింది. ధనరాజ్ ఆటోవాలా పాత్రలో మెప్పించాడు. రాహుల్ రామకృష్ణ బాగానే చేసినా.. చెప్పులు కుట్టేవాడి పాత్రకు రాహుల్ రామకృష్ణ ఆహార్యం.. స్క్రీన్ ప్రెజెన్స్ సెట్ కాలేదు. అతిథి పాత్రలో మీరా జాస్మిన్ బాగుంది.


సాంకేతిక వర్గం:

పరిమిత బడ్జెట్లోనే తెరకెక్కించినప్పటికీ 'విమానం'లో నిర్మాణ విలువలు.. సాంకేతిక హంగులు బాగున్నాయి. సినిమాలో క్వాలిటీ కనిపిస్తుంది. చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగానే కాక గేయ రచయితగా మెప్పించాడు. రేలారే పాట సినిమాలో హైలైట్ గా నిలిచింది. ఆ పాటను బిట్లు బిట్లుగా వాడుకున్న తీరు బాగుంది. వివేక్ కాలెపు కెమెరా పనితనం కూడా బాగుంది. రైటర్ కమ్ డైరెక్టర్ శివప్రసాద్ యానాల.. చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది. కానీ ఆ పాయింట్ చుట్టూ ఆసక్తికర కథ.. రసవత్తరమైన కథనాన్ని అల్లుకోలేకపోయాడు. కొన్ని సీన్లు.. మూమెంట్స్ వరకు మెప్పించినా.. ఓవరాల్ గా శివప్రసాద్ ఆకట్టుకోలేకపోయాడు. అతడి డైలాగులు మరీ నాటకీయంగా ఉన్నాయి.

చివరగా: విమానం.. టేకాఫ్ కష్టాలు

రేటింగ్-2.25/5