Begin typing your search above and press return to search.

మన అద్భుతాలను వదిలేసి వాటిని చూస్తున్నాం.. విక్రమ్‌ కామెంట్స్ వైరల్‌

By:  Tupaki Desk   |   26 Sep 2022 5:27 AM GMT
మన అద్భుతాలను వదిలేసి వాటిని చూస్తున్నాం.. విక్రమ్‌ కామెంట్స్ వైరల్‌
X
తమిళ భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్ ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో పలువురు స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటించాడు. అందులో విక్రమ్‌ కూడా ఒకరు అనే విషయం తెల్సిందే. హీరోగా విక్రమ్‌ నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చాయి. కానీ ఈ సినిమా మాత్రం ఆయనకు చాలా కాలం తర్వాత ఒక భారీ విజయాన్ని కట్టబెట్టబోతుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

దేశ వ్యాప్తంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చక్కర్లు కొడుతున్నారు. సినిమా గురించి యూనిట్‌ సభ్యులు ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఒక ప్రమోషనల్‌ ఈవెంట్‌ లో హీరో విక్రమ్‌ చేసిన వ్యాఖ్యలు సినిమా గురించి కాకుండా ఇండియన్ సంస్కృతి గురించి జనాలు ఆలోచించేలా చేసింది. ఆయన మాటలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

భాషతో సంబంధం లేకుండా విక్రమ్‌ వీడియోను పెద్ద ఎత్తున జనాలు తెగ షేర్‌ చేస్తున్నారు. ఆ వీడియోలో విక్రమ్‌ మాట్లాడుతూ... మన చుట్టూ ఉన్న అద్భుతమైన సంస్కృతి ని మర్చిపోతున్నాం. పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం.

ఎక్కడో ఉన్న లీనింగ్ టవర్ ఆఫ్ పీసా నిర్మాణ లోపంతో పక్కకు ఒరిగితే దాన్ని ఒక అద్భుతం అన్నట్లుగా మనం చూస్తున్నాం.. దాని వద్ద నిలబడి ఫోటోలు దిగుతున్నాం. కానీ వందల ఏళ్ల క్రితం నిర్మించిన నిర్మాణాలు ఇప్పటికి ఎంతో దృఢంగా మన చుట్టూ ఉన్నాయి.

మన దేశంలోని అనేక ప్రాంతాల్లో పురాతన కట్టడాలు ఉన్నాయి. వాటికి కనీసం సంరక్షిస్తూ సున్నాలు వేయించే పరిస్థితి లేదు. వందల ఏళ్ల క్రితం కట్టినా కూడా ఇంకా చెక్క చెదరకుండా ఉండటం కు కారణం ఏంటీ అనే విషయాలను అధ్యయనం చేయకుండా వాటిని విస్మరిస్తూ ఉన్నారు. ప్రతి పురాతన కట్టడం ఒక అద్భుతం. అయినా కూడా మనం వాటిని చిన్న చూపు చూస్తూ ఉన్నాం.

చోళ రాజులు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కట్టడాలు ఇంకా దృఢంగా ఉండటం కు కారణం ను గుర్తించడం కష్టం.. అంతే కాకుండా ఆ కాలంలోనే అంతటి అద్భుతమైన కట్టడాలు ఎలా సాధ్యం అయ్యాయి అంటూ ఎవరూ కూడా గుర్తించ లేరు. వాటిని మనం పట్టించుకోవడం మానేసి ఎక్కడో వంగిపోయిన టవర్ లను.. కూలి పోయిన వంతెన గురించి మాట్లాడుకుంటున్నాం.

మన ఇండియాను నార్త్‌ సౌత్‌ అంటూ మనమే విభజించుకుని మరీ తేడాలు చూస్తున్నాం. మనం అంతా ఇండియన్స్‌.. మనం అంతా కూడా మన దేశం యొక్క పూర్వ చరిత్ర ను.. మన చుట్టూ ఉన్న గొప్ప చారిత్రాత్మక కట్టడాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ విక్రమ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. మన చరిత్రను తట్టి లేపి చూపించే విధంగా పొన్నియన్‌ సెల్వన్ సినిమా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.