విజయ్ దేవరకొండ ఆ డైరెక్టర్ దగ్గర పనిచేశాడట!

Tue Aug 16 2022 10:09:07 GMT+0530 (IST)

Vijay Devarakonda Worked With That Director!

సినిమాలో కనిపించడమనేది సినిమా చూడటమంత తేలిక కాదు. అందుకు ఎన్నో కష్టాలు పడాలి  .. అవమానాలు ఎదుర్కోవాలి. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా తెరపైకి వచ్చి క్రేజ్ సంపాదించుకోవడమనేది చాలా కష్టమైన విషయం. సినిమాల్లోకి నేరుగా ఎంట్రీ కష్టమని భావించినవారు ముందుగా సినిమాలో ఒక భాగం కావడానికి ప్రయత్నిస్తారు. ఆ తరువాత అవకాశాన్ని బట్టి కెమెరా ముందుకు రావడానికి ట్రై చేస్తారు. రవితేజ .. నాని .. అలా ఎదిగినవారే. తాను కూడా అదే రూట్లో వచ్చినట్టుగా తాజా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ చెప్పాడు.రవిబాబు దర్శకత్వంలో 2011లో వచ్చిన 'నువ్విలా' సినిమాతో విజయ్ దేవరకొండ తెలుగు తెరకి పరిచయమయ్యాడు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలకి ముందు ఆయన దర్శకుడు తేజ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడట.

ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. డైరెక్టర్ తేజ దగ్గర కొంతకాలం పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాననీ .. ఆ తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ టీమ్ లో చేరడానికి ట్రై చేశానని అన్నాడు. అలాంటి తనకి పూరి డైరెక్షన్లో చేసే ఛాన్స్ రావడం అదృష్టమని చెప్పాడు.

అప్పటివరకూ నలుగురు హీరోల్లో ఒకడిగా కనిపిస్తూ వచ్చిన విజయ్ దేవరకొండకి 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో హీరోగా ఒక గుర్తింపు దక్కింది. 'పెళ్లి చూపులు' సినిమాతో సోలో హీరోగా ఆయన తొలి సక్సెస్ ను అందుకున్నాడు.

ఇక ఆ తరువాత వచ్చిన 'అర్జున్ రెడ్డి' సాధించిన సంచలన విజయంతో విజయ్ దేవరకొండ క్రేజ్ .. మార్కెట్ పూర్తిగా మారిపోయాయి. 'గీత గోవిందం' ఆయన స్టార్ డమ్ కి మరింత సపోర్ట్ గా నిలిచింది. ఆ తరువాత ఒకటి రెండు ఫ్లాపులు పడినప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు.

పాండమిక్ కారణంగా విజయ్ దేవరకొండ నుంచి సినిమా రావడం ఆలస్యమైంది. ఆయన కెరియర్లో తొలి పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకులను పలకరించడానికి 'లైగర్' రెడీ అవుతోంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. బాక్సింగ్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందన్నది చూడాలి మరి.