మెగాస్టార్ కు ఫుల్ సపోర్టు పలికేసిన రౌడీ!

Sat Jan 15 2022 10:06:38 GMT+0530 (IST)

Vijay Devarakonda Supports Chiranjeevi

జరిగిన ఒక సంఘటన మీద వ్యూస్ చెప్పటం ఒక పద్దతి. కానీ.. మన మనసులో పుట్టిన ఆలోచనల్ని న్యూస్ గా ప్రెజెంట్ చేయటం మాత్రం తప్పే అవుతుంది. ఎలా అయితే.. సెలబ్రిటీలు.. సినిమావాళ్లు.. తమ సోషల్ మీడియాలో క్లిక్కుల కిక్  కోసం రోజుకో యేషం వేస్తున్నారో.. సోషల్ మీడియాలో చిన్న చిన్న గల్లా పెట్టెలు పెట్టుకొని కూర్చున్నారో.. వారంతా తమ రోజువారీ వ్యూస్ ఎంత వైరల్ కావాలో మెదడుకు పదును పెడుతూ.. కొంగొత్త ఐడియాలతో వార్తల రూపంలో వండి వార్చేస్తున్నారు. అర్థం లేని ప్రచారాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి.. దానికి వివరణ ఇవ్వటం మొదలైనప్పటి నుంచి ఇలాంటి తీరు అంతకంతకూ తగ్గుతుందే తప్పించి పెరగదు. దీనికి తోడు.. ఇలాంటి పోస్టులకు వచ్చే క్లిక్కులు కుమ్మరించే కాసులు కూడా ఇలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లుగా ఎవడి బుర్రలోనో తొలిచిన ఆలోచన.. చూస్తుండగానే అదో వార్తగా మారి.. వైరల్ కావటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో చిరు సమాధానం చెప్పాల్సిన వచ్చింది. మౌనంగా ఉంటే ఎక్కడ తాటాకులు కట్టేస్తారో అన్న ఆందోళనతో ఆయన.. వైరల్ గా మారిన రాజ్యసభ ఆఫర్ మీద స్పందించారు. అవన్నీ తూచ్ మాటలుగా తేల్చి..నిజంగా నిజం.. నేను రాజకీయాల్ని వదిలేశాను.. నా శేష జీవితం మొత్తం సినిమాలకే అంకింతమని ఆయన తన కమిట్ మెంట్ గురించి మరోసారి స్పష్టం చేయాల్సి వచ్చింది.

ఇలాంటి వేళ.. చిరు చేసిన  ట్వీట్ కు తాజాగా రౌడీ అలియాస్ విజయదేవరకొండ స్పందించారు. #GiveNewsNot Views హ్యాష్ టాగ్ ను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసి.. తాను పూర్తి మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించారు. చిరు పోస్టు చేసిన భారీ వివరణ ట్వీట్ కు.. #GiveNewsNotViews హ్యాష్ టాగ్ చేయటం ద్వారా.. చిరుకు తన ఫుల్ సపోర్టును ప్రకటించారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున రీట్వీట్ చేస్తున్నారు. మొత్తంగా మెగాస్టార్ కు రౌడీ స్టార్ ఫుల్ సపోర్టు ప్రకటించటం సరైన స్పందనగా అభిప్రాయపడుతున్నారు. మిగిలిన వారు కూడా ముందుకు వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.