పండగల చిలౌట్ కు పెళ్లితో పనేంటి?

Mon Apr 15 2019 22:32:02 GMT+0530 (IST)

అందాల నయనతార - విఘ్నేష్ శివన్ బాంధవ్యం గురించి తెలిసిందే. ఆ ఇద్దరూ పెళ్లి అనే మాటెత్తకుండా సహజీవనంతో నిరంతరం మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ జంట పెళ్లికి రెడీ అవుతోందని.. నేడో రేపో వివాహానికి ప్లాన్ చేస్తున్నారని మీడియాలో రకరకాల కథనాలొస్తున్నాయి తప్ప అసలు ఈ జోడీ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారా? అంటే అసలు అలాంటి ఆలోచనే లేదని వారి ప్రవర్తన వ్యవహారికం చెబుతోంది.పెళ్లి అనే మాట తప్ప ఇతరత్రా వ్యాపకాలన్నీ మామూలే. షికార్లు.. సెలబ్రేషన్ రెగ్యులర్ గా కామన్. ఆ ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాలు.. వేర్వేరు సంస్కృతులు.. ఆచారాలకు చెందిన వారు కావడంతో ఇరు కుటుంబాల్లో పండగలు- పబ్బాల వేళ సెలబ్రేషన్స్ అంతే స్పెషల్ గా చేసుకుంటున్నారట. నయన్ కుటుంబంలో మలయాళీ సంప్రదాయంతో కూడుకున్న పండగలకు ప్రాధాన్యత ఉంటుంది. అలాగే విఘ్నేష్ కుటుంబంలో తమిళ సాంప్రదాయం తో కూడుకున్న పండగలు కనిపిస్తాయి. క్రిస్మస్ ఇద్దరికీ ఎంతో ప్రత్యేకమైన పండగ అయితే.. ఇతరత్రా పండగలు స్పెషల్ గానే సెలబ్రేట్ చేస్తున్నారట. పండగ ఏదైనా ఇంటిల్లిపాదీతో కలిసి నయన్ - విఘ్నేష్ జంట ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని తాజా ఫోటోలు చెబుతున్నాయి.

ఇటీవలే ఈ జంట పూతండు విషు అనే రెండు పండగల్ని సంబరంగా జరుపుకున్నారు. ఈ పండగల్లో ఇరు కుటుంబాలు సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్లిపోయాయి. మనకు తెలుగు సంవత్సరం ఉగాది ఎలానో.. తమిళులు.. మలయాళీలకు ఈ పండగలు ఆ తరహా అని తెలుస్తోంది. తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోల్ని విఘ్నేష్ శివన్ సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేశారు. ఈ సంబరాల్లో నయనతారతో పాటు విఘ్నేష్ శివన్ తల్లి.. నయనతార సోదరి.. ఆమె భర్త ఎంతో ఆస్వాధిస్తూ కనిపిస్తున్నారు. కెరీర్ పరంగా పరిశీలిస్తే .. దర్శకుడిగా విఘ్నేష్ బిజీగా లేకపోయినా నయన్ మాత్రం కథానాయికగా పూర్తి బిజీ. మెగాస్టార్ చిరంజీవి సరసన `సైరా`లో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన `దర్బార్` చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ శివకార్తికేయన్ సినిమాల్లోనూ నాయికగా నటిస్తున్నారు. మరో మలయాళ చిత్రం సెట్స్ పై ఉంది.