Begin typing your search above and press return to search.

ఎన్నెన్నో జన్మల బంధం... ఆ గానామృతం

By:  Tupaki Desk   |   5 Feb 2023 10:00 AM GMT
ఎన్నెన్నో జన్మల బంధం... ఆ గానామృతం
X
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అలాగే ఆమె పుట్టగానే సరిగమలు గమకాలు ఆమె చుట్టూ పరిమళించాయి. అందుకే జాతకుడు చెప్పాడని తండ్రి కలై వాణి అని పేరు పెట్టారు. అలా ఆమె భవిష్యత్తులో మధుర సంగీత వాణి గా గాంధర్వ గాన ఝరిగా మారుతుందని నాడే జ్యోతిష్యులు ఊహించారు. అదే నిజం అయింది. వాణీ జయరాం డెబ్బై ఎనిమిదేళ్ళ ఆమె జీవితంలో యాభై ఏళ్లు సినీ సంగీతం అయితే అంతకు ముందు ఇరవై ఏళ్ళు సంగీత పారాయణంతో గాన పారవశ్యంతోనే గడచిపోయాయి. దక్షిణాదిన డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ క్రిష్ణ అయిదేళ్ళ ప్రాయంలోనే సంగీతాన్ని ఔపాశన పట్టారని చెబుతారు.

అయితే దక్షిణాది మీరాగా గుర్తింపు పొందిన వాణీ జయరాం కూడా ఏమీ తీసిపోలేదు. ఎనిమిదేళ్ళకే పాటతోనే తన జీవితాన్ని మొదలెట్టారు. పదేళ్ళకే మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో ఆమె పాటలు పాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అలా వాణీజయరాం సంగీతం చెన్నై వీధుల నుంచి విను వీధులకు పాకింది. 1970లో గుడ్డి అన్న హిందీ సినిమా ఆమె తొలి హిందీ పాటతో సాగితే 1973లో అభిమానవంతులు అనే తెలుగు సినిమాతో ఆమె తెలుగు శృతలను కట్టిపడేశారు.

ఇక 1975లో వచ్చిన ఏవీఎం వారి పూజ సినిమాలో అన్ని పాటలూ ఆమె పాడారు. పూజలు చేయ పూలు తెచ్చాను అన్న భక్తి గీతం నుంచి ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ అంటూ మధురంగా పలికిన ఆ గొంతుక తెలుగు వారికి ఎన్నో జన్మల బంధాన్నే గుర్తుకు తెచ్చింది. అది అలా దశాబ్దాలుగా ఆగని స్వర ప్రవాహమైంది. ఇక విడదీయలేని బంధంగా మారి శాశ్వతమైపోయింది.

వాణిజయరాం శంకరాభరణంలో పాడిన పాటలు ఈ రోజుకీ చెవులకు అమృతాన్నే అందిసాయి. మానస సంచరరే అన్న ఆమె పాట జాతీయ అవార్డుని అందించింది. ఆ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే దొరకునా ఇటువంటి సేవ అంటూ బాలూతో పాడిన ఆ గీతం ఎప్పటికీ శ్రోతలకు దొరకని గాన భాగ్యమే. వాణి జయరాం గొంతులో ఒక ప్రత్యేకత ఉంది. ఆమె పాడితే కోయిల గానంగానే ఉంటుంది.

వయసు పెరిగినా గొంతు మాత్రం అక్కడే అలా ఆగిపోయింది. ఎన్నో గీతాలు ఆ గొంతులో ప్రాణం పోసుకున్నాయి. ఘర్షణ సినిమాలో ఒక బృందవనం పాట వింటే బృందావనంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. విరిసేను చిరు జల్లులే అంటూ అదే సినిమాలో మరో గీతం అలా ఉరకలెత్తే సెలయేరులా సాగిపోతూ వింత అనుభూతిని ఇస్తుంది.

కళాతపస్వి కె విశ్వనాధ్ తీసిన స్వాతి కిరణంలో ఆనతి ఈయరా హరా అంటూ ఆమె ఆలపించిన గీతం యోగ నిద్రలో ఉన్న మహా శివుడునే ఇలకు రప్పించేలా సాగుతుంది. ఆర్తి భక్తి అంతా అందులో కనిపిస్తుంది. ఈ పాటకు కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా ఆమె అవార్డు అందుకున్నారు. స్వర్ణకమలం అందెల రవళిది అంటూ సాగే అద్భుతమైన గీతం వాణీ జయరాం గొంతు నుంచి జాలువారితే చెవులను అప్పగించని శ్రోత ఉంటాడంటే నమ్మలేరుగా.

ఒకటి రెండూ కాదు వేల పాటలు ఆమె తెలుగులో పాడారు. ఆమె తెలుగు చిత్ర సీమకు వచ్చిన కొత్తలో అంటే 1975లో అమ్మాయిల శపధం సినిమాలో నీలి మేఘమా జాలి చూపుమా అంటూ ఎస్పీ బాలుతో కలసి ఆలపించిన యుగళ గీతం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. ఒక్క తెలుగు కాదు తమిళ్, హిందీ, కన్నడ వంటి పద్నాలుగు భాషలలో పాటలు పాడిన సంగీత సరస్వతి వాణీ జయరాం.

అలుపు లేని ఆ గొంతు అలలు కదిలినా పాటే అని కలలు చెదిరినా పాటే అంటూ జీవిత సత్యాలను చెప్పే ఆ గొంతు మూగబోతే అశేష అభిమానులకు అంతకంటే చేదు వార్త ఉంటుందా. ఆమె గానామృతంతో దశాబ్దాల పాటు తరించి తడిసి ముద్దయిన శృఓతలకు అది పిడుగుపాటు కాదా. ఎలా తట్టుకోగలరు ఈ దుర్వార్తను విన్న వారు అంతా.

వాణీజయరాం నిండైన వ్యక్తిత్వం కలిగిన మహిళా శిరోమణి.ఇక ఆమె ప్రతిభాపాటవాలు అపూర్వం. ఆమె మొదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. భర్త జయరాం పేరుని తనలో సగభాగం చేసుకుని తన విశేష కీర్తిలో మరో సగాన్ని ఆయనకు అందించి ఆదర్శ దాంపత్యం తమదని చాటారు. తనకు పిల్లలు లేకపోయినా పాడిన ప్రతీ పాటనూ ఒక పాపాయిగా చూసుకుంటూ మురిసిపోయే అపూర్వ మాతృమూర్తి.

తన కంటే చిన్న వారిని చిన్న పిల్లలను సైతం మీరు అని పిలించే గొప్ప సంస్కారం ఆమె సొంతం. ఏ వివాదాలకు వాదాలకు తావు లేని ఏడున్నర పదుల జీవితాన్ని ఆమె సాగించారు. పద్మ భూషణ్ అవార్డు ఆమెకు చాలా ఆలస్యంగా వచ్చిందని అభిమానులు అనుకుంటున్న వేళ ఆ పౌర పురస్కారాన్ని అందుకునే ఘడిన దాకా ఆగకుండా ఆనతీయరా హరా అంటూ ఆ పరమశివునిలో ఐక్యం అయిన వాణీజయరాం తో గానబంధం ఎన్నెన్నో జన్మలది, మరెన్ని జన్మలైనా అది వసివాడనిది.వీడి పోలేనిది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.