Begin typing your search above and press return to search.

వేణు తొట్టెంపూడి ఆ మాట మాత్రం దాటేశాడే!

By:  Tupaki Desk   |   7 July 2022 4:00 AM GMT
వేణు తొట్టెంపూడి ఆ మాట మాత్రం దాటేశాడే!
X
వేణు తొట్టెంపూడి ఒకప్పుడు హీరోగా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నారు. 1999లో వచ్చిన 'స్వయంవరం' సినిమాతో ఆయన తెలుగు తెరకి పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన వేణు, ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. హీరోగా కామెడీ టచ్ ఉన్న పాత్రలను ఆయన ఎక్కువగా చేస్తూ వెళ్లారు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో .. స్పీడ్ గా ఉండే డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మల్టీ స్టారర్ సినిమాల్లోను నటించారు.

జగపతిబాబుతో కలిసి చేసిన 'హనుమాన్ జంక్షన్' ఆయన కామెడీ టైమింగ్ కి ఉదాహరణగా కనిపిస్తుంది. 'పెళ్ళాం ఊరెళితే' .. 'బహుమతి' వంటి సినిమాలు ఆయనను ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువ చేశాయి. ఆ తరువాత కాలంలో హీరోగా వేషాలు తగ్గడంతో కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా మారిపోయారు. అలా 2012లో 'దమ్ము' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన ఆయన ఆ తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు. వేణు ఏమైపోయాడని అభిమానులు తలచుకుంటూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఆయన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నట్టుగా నిన్ననే ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

తాజా ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ .. "నేను ఎప్పుడూ ప్రేమించేది సినిమానే .. సినిమాలు చేయడం .. చూడటం మొదటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం. కొన్ని అనివార్య కారణాల వలన నేను సినిమాలకు దూరం కావలసి వచ్చింది. 20 ఏళ్ల తరువాత 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం హ్యాపీగా అనిపిస్తోంది.

ఈ సినిమాను మాత్రమే కాదు 'చాయ్ బిస్కట్' బ్యానర్ లో రూపొందుతున్న 'పారా హుషార్' అనే మరో సినిమాలోనూ కీలకమైన రోల్ ఒకటి చేస్తున్నాను. 'రామారావు ఆన్ డ్యూటీ' దర్శకుడు శరత్ మండవ ఈ సినిమా చేయమని కాల్ చేసి అడిగితే, నేను ఇప్పుడు సినిమాలు చేయడం లేదనే చెప్పాను.

అయినా నన్ను ఒకసారి కలుస్తానని అంటే .. సరే అన్నాను. ఆయన నన్ను కలిసి ఈ పాత్రకి నన్నే ఎందుకు అనుకున్నది చెప్పుకొచ్చాడు. ఈ పాత్రలో నన్నే ఊహించుకున్నట్టు చెప్పాడు. అంతలా ఆయన అడగడంతో ఓకే అనేశాను" అంటూ చెప్పుకొచ్చారు. అసలు ఎందుకు ఇంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండవలసి వచ్చిందనేది మాత్రం చెప్పకపోవడం ఆశ్చర్యం.