ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయిన సీనియర్ నరేష్..?

Thu Jun 30 2022 17:40:28 GMT+0530 (IST)

VK Naresh left the press meet

సీనియర్ నటుడు వీకే నరేశ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి దూరంగా ఉంటున్న నరేష్.. ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నరేశ్ మూడో భార్య రమ్య.. కన్నడ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆరోపణలు చేసింది.నరేష్ తో తనకు సంబంధాలు తెగిపోలేదని.. తాను అతనికి ఇప్పటికీ భార్యనే అని రమ్య చెప్పింది. ఇంకా విడాకుల పేపర్లపై సంతకం చేయలేదని.. అందుకే భార్య నని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదని తెలిపింది. ఇటీవల నరేష్ విడాకుల నోటీసు పంపించారని.. చట్ట ప్రకారం దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని.. అది ప్రస్తుతం కోర్టులో పెండింగ్ లో ఉందని రమ్య పేర్కొన్నారు. తనకు ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఉందని తెలిపింది.

నరేష్ - పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ.. దానికి సంబంధించి వారిద్దరూ అధికారిక ప్రకటన చేయలేదని రమ్య అన్నారు. పవిత్ర లోకేష్ తమ మధ్యకు వచ్చినప్పటి నుంచి తమ కుటుంబానికి ఇబ్బందులు మొదలయ్యాయని చెప్పింది. నరేష్ తన గురించి మీడియాలో తప్పుడు కథనాలు వచ్చేలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది.

అయితే తన మూడో భార్య రమ్య ఆరోపణల పై స్పందించిన నరేష్.. ఇవాళ బెంగుళూరులో ప్రెస్ మీట్ లో సమాధానం చెబుతానని అన్నారు. అయితే విలేకరుల సమావేశంలో కన్నడ పవర్ టీవీ ఛానల్ ఉంటే తాను మాట్లాడనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కార్ లో బయటకు వెళ్తున్న వీడియో కూడా ఒకరి చక్కర్లు కొడుతోంది. తప్పకుండా అన్ని విషయాలు చెబుతానని.. తనకు న్యాయం కావాలని అనడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే నరేష్ తో రిలేషన్ ను పవిత్ర ఒప్పుకున్నట్లు ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. పవర్ టీవీ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో ఈ విషయం బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో నరేష్ - పవిత్ర రహస్యంగా పెళ్లి చేసుకున్నారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో పవిత్ర మైసూరులోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ను క్రియేట్ చేయటమే కాకుండా.. తనకు ఇబ్బంది కలిగించేలా పోస్టులు పెడుతున్నారని పవిత్ర పేర్కొంది. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.