ఎలాగైనా 'ఉప్పెన' తీరాన్ని దాటించాలని చూస్తున్న మేకర్స్..!

Sat Jan 23 2021 12:05:18 GMT+0530 (IST)

Uppena Movie Release Date Fixed

మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా ''ఉప్పెన''. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మించాయి. మెగా హీరో డెబ్యూ మూవీ అయినప్పటికీ మేకర్స్ బాగానే ఖర్చు చేశారని తెలుస్తోంది. గతేడాది వేసవిలో రిలీజ్ కావల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అవడంతో పాటు సాదారణ పరిస్థితులు ఏర్పడటంతో 'ఉప్పెన' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఎలా అయినా బాక్సాఫీస్ గండాన్ని దాటించాలని మేకర్స్ సతమతమవుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.వాస్తవానికి 'ఉప్పెన' చిత్రాన్ని ఫిబ్రవరి 5న విడుదల చేయాలని అనుకున్నారట. ఇదే కనుక జరిగితే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే రెండు వారాలు ఫుల్స్ నడవాల్సి ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 18 - 20 కోట్లు చేయాల్సిన అవసరం ఉందని.. అలా చేస్తేనే సినిమాకి పెట్టిన పెట్టుబడి వర్క్ అవుట్ అవుతుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఫిబ్రవరి 5న 'ఉప్పెన' చిత్రాన్ని సోలో రిలీజ్ చేసే అవకాశం లేదు. పోనీ తరువాత వారం విడుదల చేస్తే ఆ వెంటనే నితిన్ 'చెక్' పెట్టడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా చూసిన సినీ పెద్దలంతా ఇదో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని చెబుతున్నారట. కాకపోతే ఇదో యాంటీ క్లైమాక్స్ సినిమా అని.. ఆ విషయాన్ని ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మెగా హీరో 'ఉప్పెన' తీరం దాటుతాడేమో చూడాలి.