'సింహాద్రి' రీ-రిలీజ్ పై నెట్టింట రచ్చ పీక్స్ లో!

Thu Aug 11 2022 13:06:45 GMT+0530 (India Standard Time)

Update on Simhadri ReRelease

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన 'పోకిరి' ఆగస్టు 9 ప్రిన్స్ బర్త్ డే సందర్భంగా 4కే అల్ట్రా సౌండ్  లో రీ రిలీజ్  అయిన సంగతి  తెలిసిందే. పండుగాడు దెబ్బకి మరోసారి బాక్సాఫీస్ మోత మోగింది. తెలుగు రాష్ర్టాల తో పాటు ఓవర్సీస్ లోనూ   రిలీజ్ అయిన సినిమాకి మహేష్ అభిమానులు మళ్లీ బ్రహ్మరధం పట్టారు.175 థియేటర్లలో రిలీజ్ అయిన  పోకిరికి  ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆన్ లైన్ లో టిక్కెట్లు కొత్త సినిమా తరహాలో హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. అమెరికాలో 15598 డాలర్లు.. ఆస్ట్రేలియాలో 3733 డాలర్లు వసూలు చేసినట్లు ఓ ట్రేడ్ అంచనా. తెలుగు రాష్ర్టాల వ్యాప్తంగానూ భారీ  గ్రాస్ రాబట్టినట్లు  సమాచారం.

మొత్తంగా 16 ఏళ్ల క్రితం పోకిరి మళ్లీ  అభిమానుల్ని థ్రిల్ చేసింది. జనాలు థియేటర్లకు రావడం లేదు అన్న అపోహని పోకిరికి రీ-రిలీజ్ తుడిచిపెట్టేసింది. ఇప్పుడిది సోషల్ మీడియా లో ట్రెండ్ గా మారింది.

దీంతో పలువురు హీరోల అభిమానులు బ్లాక్ బస్టర్ చిత్రాల్ని  రీ-రిలీజ్ చేయాలంటూ రచ్చ చేస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందు వరుసలో ఉన్నారు.

ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన 'సింహాద్రి' చిత్రాన్ని  రీ-రిలీజ్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి సౌండింగ్ సిస్టమ్స్ లో కి మార్చి 'సింహాద్రి'ని  రీ-రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందంటూ అభిమానులు కోరుతున్నారు. తారక్ పాన్ ఇండియా స్టార్ అయిన నేపథ్యంలో రీ రిలీజ్ చేస్తే సినిమాకి మంచి  రెస్పాన్స్ వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

మరి మేకర్స్ ఆ విధంగా ఆలోచన చేస్తారా? అన్నది చూడాలి. ఇదే జరిగితే మరింత మంది అభిమానులు తమ హీరోల సినిమాల్ని సైతం  రీ-రిలీజ్ చేయమనే రచ్చ పీక్స్ కి చేరుతుంది. అయితే ఈ రీ-రిలీజ్ లు హీరోలకి కొత్త రకంగా ఫాలోయింగ్ ని తెచ్చిపెడుతుంది.  హిట్ కంటెంట్ సహా రన్నింగ్ హీరోల చిత్రాలే కాబట్టి ఇప్పటి యువత  రీ-రిలీజ్ లకు బాగానే  కనెక్ట్ అవుతున్నారు.