జక్కన్న సినిమా అంటే ఆ మాత్రం ఉండాలిగా..!

Wed Jul 06 2022 14:55:10 GMT+0530 (IST)

Update on SS Rajamouli Film

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఒక సినిమా తీయడానికి ఎక్కువ సమయమే తీసుకుంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. ప్రతీ సీన్ పర్ఫెక్ట్ గా రావాలని తపించే జక్కన్న.. షూటింగ్ ప్రారంభించిన తర్వాత సినిమా ఎప్పుడు పూర్తవుతుంది.. ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయాల గురించి మర్చిపోవాలని ఇండస్ట్రీలో అంటుంటారు.'బాహుబలి: ది బిగినింగ్' 'బాహుబలి: ది కన్ క్లూజన్' సినిమాలు చేయడానికి రాజమౌళి దాదాపు ఐదేళ్లు టైం తీసుకున్నారు. ఇటీవల వచ్చిన 'ఆర్.ఆర్.ఆర్' మూవీ కోసం మూడేళ్లకు పైగానే కేటాయించాల్సి వచ్చింది. వెండితెరపై విజువల్ వండర్స్ ఆవిష్కరించడానికి అంత సమయం తీసుకుంటారు కాబట్టే.. దానికి తగ్గ ఫలితం అందుకుంటున్నారు. అందుకే ఆయనతో వర్క్ చేసే హీరోలు మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచన చేయకుండా.. పూర్తిగా జక్కన్నకే అంకితం అవుతుంటారు.

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి. దశాబ్దం క్రిందటే ఈ క్రేజీ కాంబినేషన్ లో చర్చలు జరుగగా.. అది ఇన్నేళ్లకు కార్యరూపం దాల్చుతున్నందుకు సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

ప్రస్తుతం మహేష్ కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు రాజమౌళి మరియు అతని తండ్రి విజయేంద్రప్రసాద్. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గురించి ఆలోచన చేయమని దర్శకుడు చెప్పినట్లు బాహుబలి రచయిత ఇది వరకే వెల్లడించారు. జక్కన్న సైతం మహేష్ కోసం రెండు లైన్లు అనుకుంటున్నట్లు తెలిపారు. వీటిల్లో స్టార్ హీరో ఒకే చేసే లైన్ పై ఫోకస్ చేయనున్నారు.

ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీ చేయని మహేష్ బాబుతో ఈసారి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ని తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్స్ రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో హై టెక్నీకల్ వాల్యూస్ తో ఈ మూవీ రూపొందనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తైన తర్వాత.. వచ్చే ఏడాది రాజమౌళి సినిమా ప్రారంభమవుతుంది.

అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు మూడేళ్ళ పాటు వర్క్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. మూడేళ్లు అంటున్నప్పటికీ రాజమౌళి సినిమా అంటే అనుకున్న దాని కంటే ఎక్కువ టైం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దీనిని బట్టి త్రివిక్రమ్ సినిమా తరువాత మహేష్ బిగ్ స్క్రీన్ పై కనిపించడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.