ది గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం 30 ఏళ్ల డ్రీమ్ 'పొన్నియిన్ సెల్వన్'. ప్రముఖ రచయిత కల్కీ కృష్ణమూర్తి అత్యంత పాపులర్ నవల 'పొన్నియిన్ సెల్వన్' ఆధారంగా చోళుల కథని వెండితెరపై ఆవిష్కరించాలని మణిరత్నం గత 30 ఏళ్లుగా కలలు కంటూనే వున్నారు. ఎంజీ రామచంద్రన్ నుంచి రజనీకాంత్ కమల్ హాసన్ వంటి దిగ్గజ స్టార్లతో ఈ మూవీని తెరపైకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఆ తరువాత విజయ్ సూపర్ స్టార్ మహేష్ లతో అయినా తన కలల ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలనుకున్నారు.
బడ్జెట్ విషయంలో ఫైనాన్షియర్లు నిర్మాతలు ఎవరూ సాహసం చేయడానికి ముందుకు రాకపోవడంతో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఏళ్లుగా కార్యరూపం దాల్చలేకపోయింది. ఎట్టకేలకు లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ముందుకు రావడంతో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైనల్ గా పట్టాలెక్కింది. విక్రమ్ ఐశ్వర్యా రాయ్ కార్తి త్రిష జయం రవి వంటి కీలక నటీనటులు నటించగా ఈ మూవీని మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించాడు.
ఫస్ట్ పార్ట్ ని గత ఏడాది సెప్టెంబర్ 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు. ఇతర భాషల్లో పెద్దగా ప్రభావాన్ని చూపించకపోయినా గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పట్టారు.
ఆ తరువాత క్రమ క్రమంగా అన్ని భాషల్లోనూ ఈ మూవీ తనప్రభావాన్ని చూపించడం మొదలు పెట్టింది. వరల్డ్ వైడ్ గా ఊహించని విధంగా 'పొన్నియిన్ సెల్వన్' 500 కోట్ల మేర వసూళ్లని రాబట్టి ట్రేడ్ పండితుల్ని విస్మయానికి గురిచేసింది.
విక్రమ్ ఐశ్వర్యారాయ్ కార్తి త్రిషల నటన సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచింది. ఇదిలా వుంటే 'పొన్నియిన్ సెల్వన్ 2'ని ఏప్రిల్ లో మరిన్ని హంగులతో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఐ మ్యాక్స్ ఫార్మాట్ లో ఈ మూవీని ఏప్రిల్ 28న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నామని చిత్ర బృందం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.
ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చారిత్రాత్మక మూవీకి రవివర్మన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పద్మశ్రీ తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తుండగా ప్రముఖ సీనియర్ ఎడిటర్ శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని దృష్టిలోపెట్టుకుని చాలా మార్పులతో మరిన్ని ప్రత్యేకతలతో పార్ట్ 2 ని మణిరత్నం రూపొందించినట్టుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.