నరేష్ పవిత్రా లోకేష్ల 'మళ్లీ పెళ్లి'.. ఎప్పుడంటే?

Fri Mar 24 2023 12:05:57 GMT+0530 (India Standard Time)

Update on Naresh Pavitra MalliPelli

నరేష్ పవిత్రా లోకేష్.. వీరిద్దరి గురించి వారి పెళ్లి గురించి జరిగినంత చర్చ ఏ సెలబ్రిటీ విషయంలోనూ జరిగి ఉండదు. అంతగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు నరేష్ పవిత్రలు. వీరిద్దరి ప్రేమ సహజీవనం ఆ తర్వాత వచ్చిన వివాదాలు ట్రెండ్ అయ్యాయి.ఏ ఇద్దరు నెటిజన్లు కలిసినా నరేష్ పవిత్రల గురించే చర్చ జరిగిందంటే అతిశయోక్తి కాదు. వీరి ప్రణయం మరో రేంజ్ కు వెళ్లిందనే చెప్పాలి. ఆ మధ్య లిప్ కిస్ చేసుకుంటున్న వీడియో వైరల్ కాగా ఇప్పుడు ఏకంగా 'మళ్లీ పెళ్లి'తో ముందుకొచ్చారు.

ఈ 'మళ్లీ పెళ్లి' ఏంటని ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నరేష్ పవిత్ర ఇద్దరూ కలిసి 'మళ్లీ పెళ్లి' అనే సినిమా తీస్తున్నారు. నరేష్ తల్లి విజయ నిర్మల స్థాపించిన విజయ కృష్ణ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. గోల్డెన్ జూబ్లీ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాకు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించనున్నారు.

నరేష్ సినీ పరిశ్రమలో అడుగు పెట్టి ఇప్పటికి 50 సంవత్సరాలు గడిచాయి. ఈ సందర్భంగా ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తీర్చిదిద్దుతున్నారు. 'మళ్లీ పెళ్లి' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో నరేష్ పవిత్ర ఇద్దరూ కనిపిస్తున్నారు.

ఇందులో నరేష్ వైట్ కలర్ కుర్తా ధరించి కనిపించాడు. వైట్ కలర్ షూస్ వేసుకున్నాడు. చేతికి స్మార్ట్ వాచ్ ధరించాడు. పవిత్ర వాకిట్లో ముగ్గు వేస్తూ ఇందులో కనిపిస్తోంది. వైట్ కలర్ కాంబినేషన్ లో ట్రెడిషనల్ వేర్ ధరించింది. ఈ 'మళ్లీ పెళ్లి' సినిమా ఈ వేసవిలో రిలీజ్ కానుందని పోస్టర్ లో మూవీ మేకర్స్ పేర్కొన్నారు.

విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. తెలుగు కన్నడ ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ నేపథ్యంలో వీరిద్దరి 'పవిత్ర' బంధం మరోసారి చర్చనీయాంశంగా మారింది.       


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.