Begin typing your search above and press return to search.

హరిహరవీరమల్లు.. ఇదేమి ట్విస్ట్ బాబోయ్?

By:  Tupaki Desk   |   1 Feb 2023 2:27 PM GMT
హరిహరవీరమల్లు.. ఇదేమి ట్విస్ట్ బాబోయ్?
X
పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. అలాగే పవన్ కళ్యాణ్ ని ఇప్పటి వరకు పీరియాడిక్ సినిమాల్లో చూసింది లేదు. హరిహర వీరమల్లుతో ఆ కోరిక తీరనుంది. హరిహర వీరమల్లు మూవీ మొగలాయిల కాలం నేపథ్యంలో తెరకెక్కుతోంది.

తెలంగాణ ప్రాంతానికి చెందిన పండుగలు సాయన్న అనే ఒక బందిపోటు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రెండు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో ఈ కథ సాగుతుందని టాక్. అయితే ఈ సినిమా అప్పట్లో ఎప్పుడో ప్రారంభమైనా ఇప్పటికీ నత్తనడకనే సాగుతోంది. టీజర్ వచ్చేస్తుందని, సినిమా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిందన్న వార్తలు తప్ప మూవీ టీం నుండి ఎలాంటి అప్ డేట్లు రావడం లేదు.

కరోనాతో షూటింగ్ ఆగిపోవడం, పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం, భారీ బడ్జెట్ సినిమా కావడంతో షూటింగ్ నిలిచిపోవడం ఇలా కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లుగా ఏదో ఒక కారణంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రూతలూగించేలా హరిహర వీరమల్లు నుండి ఒక అప్ డేట్ వచ్చింది. హరిహర వీరమల్లు మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇదే కనుక జరిగితే పీకే ఫ్యాన్స్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చేసినట్లే. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం చిత్ర బృందం నుండి అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.

హరిహర వీరమల్లు నుండి ఇప్పటికే క్రిష్ టీం విడుదల చేసిన కొన్ని వీడియోల వల్ల సినిమా మీద ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. ఎంఎం కీరవాణి ఇచ్చిన అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంచనాలను పెంచింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పంచమి అనే పాత్రలో నిధి కనిపించబోతుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.