Begin typing your search above and press return to search.

అలాంటి స్టోరీతో 'బిచ్చగాడు 3'

By:  Tupaki Desk   |   30 May 2023 11:24 AM GMT
అలాంటి స్టోరీతో బిచ్చగాడు 3
X
కొంత కాలంగా ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల్లోనూ సీక్వెల్ మూవీల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దీంతో ఫిల్మ్ మేకర్లు, హీరోలు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. దక్షిణాది మొత్తంలో ఇప్పుడు హైలైట్ అవుతోన్న ఫ్రాంచైజీలలో విజయ్ ఆంటోనీ 'బిచ్చగాడు' ఒకటి.

2016లో విజయ్ ఆంటోనీ 'బిచ్చగాడు' అనే సినిమాను చేశాడు. ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఊపులోనే ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా 'బిచ్చగాడు 2' అనే చిత్రం వచ్చింది. మొదటి దానికి శశి డైరెక్షన్ చేయగా.. రెండో దాన్ని విజయ్ ఆంటోనీనే తెరకెక్కించాడు. ఈ మూవీ కూడా ఘన విజయాన్ని అందుకుంది.

వరుసగా రెండు భాగాలూ సూపర్ డూపర్ హిట్ అవడంతో 'బిచ్చగాడు' సిరీస్‌లో మరో సినిమాను తీసుకు రాబోతున్నట్లు విజయ్ ఆంటోనీ ఇటీవలే స్వయంగా ప్రకటించాడు.

త్వరలోనే 'బిచ్చగాడు 3' వస్తుందని, దానికి కూడా తానే దర్శకత్వం చేస్తున్నానని వెల్లడించాడు. దీంతో ఈ ప్రాజెక్టుపై అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.

'బిచ్చగాడు 3' మూవీపై నెలకొన్న హైప్ వల్ల అప్పుడే దీని గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా బ్యాగ్‌డ్రాప్ వివరాలు లీక్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ చిత్రం 'బ్రదర్ సెంటిమెంట్'తో తెరకెక్కబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన డైలాగ్ వెర్షన్‌తో కూడిన స్క్రిప్టు వర్క్ కూడా పూర్తైందని ఫిలిం నగర్ సమాచారం.

'బిచ్చగాడు' మూవీలో తల్లి సెంటిమెంట్‌ను హైలైట్ చేసి చూపించారు. ఇటీవల వచ్చిన 'బిచ్చగాడు 2' సినిమా బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చింది. ఈ రెండూ భారీ హిట్లు అవడంతో ఇప్పుడు అదే పంథాలో వెళ్తూ.. 'బ్రదర్' సెంటిమెంట్‌తో రాబోతున్నారట. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలిసింది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని 2025లో రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.