Begin typing your search above and press return to search.

కార్తికేయ్ 2 ఉత్తరాది వారిని ఎందుకంత కనెక్టు అయ్యేలా చేసింది?

By:  Tupaki Desk   |   17 Aug 2022 4:47 AM GMT
కార్తికేయ్ 2 ఉత్తరాది వారిని ఎందుకంత కనెక్టు అయ్యేలా చేసింది?
X
50.. 200.. 700.. ఇవేం గణాంకాలు. సంబంధం లేనట్లుగా ఉన్నాయే. ఏ యాంగిల్లో చూసినా కూడా లెక్కలు కుదరట్లేదన్న సందేహం వద్దు. ఈ అంకెలన్ని కూడా మూడు రోజుల వ్యవధిలో బాలీవుడ్ లో కార్తికేయ మూవీకి పెరిగిన థియేటర్ల సంఖ్య మాత్రమే. 'ఎపిక్ మిస్టీకల్ అడ్వెంచర్' గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ నిర్మించారు.

అయితే.. హిందీలో ఎంతలా ఆడుతుందన్న నమ్మకం నిర్మాతకు లేదు. ఒక ప్రయత్నం చేస్తే పోలా? అన్న ఆలోచనతో ఈ సినిమాను విడుదల చేశారు. ఉత్తరాది మొత్తానికి మొదటి రోజున షోలు పడిన థియేటర్లు అక్షరాల యాభై మాత్రమే.

ఓవైపు బాలీవుడ్ సూపర్ స్టార్లు అమీర్ ఖాన్.. అక్షయ్ కుమార్ లు నటించిన మూవీలు విడుదలైన వేళ.. రోజు ఆలస్యంతో బాలీవుడ్ కు ఏ మాత్రం పరిచయం లేని హీరో నటించిన సినిమా విడుదల కావటం.. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ భారీ రెస్పాన్స్ రావటంతో రెండోరోజుకు థియేటర్ల సంఖ్య 200లకు పెరిగింది. ముచ్చటగా మూడో రోజుకు సినిమా థియేటర్ల సంఖ్య 700లకు పెరగటమే కాదు.. మరింత ఎక్కువగా థియేటర్లు పెరిగే వీలుందంటున్నారు.

ఈ జోరు చూస్తే.. తెలుగులో కంటే ఈ మూవీ హిందీలోనే ఎక్కువ వసూళ్లు చేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ ఉత్తరాది ప్రజలకు ఈ మూవీ ఇంతలా నచ్చటానికి కారణం ఏమంటే.. దాని నేపథ్యమేనని చెప్పాలి. శ్రీక్రష్ణుడి జన్మస్థలిగా చెప్పే మధుర బ్యాక్ డ్రాప్ లో సినిమా సాగటం.. సినిమా మొత్తం క్రిష్ణుడి తత్త్వంతో ముడిపడి ఉండటం ఒక అడ్వాంటేజ్ గా మారింది. దీనికి తోడు క్రిష్ణుడి ద్వారకా నగరి చుట్టూ కథను అల్లుకోవటం ఈ సినిమా విజయానికి మరో కారణంగా చెబుతున్నారు.

నిజానికి తెలుగువారితో పోలిస్తే.. ఉత్తరాది వారు శ్రీక్రష్ణుడ్ని అమితంగా కొలుస్తారు. ఆరాధిస్తారు. అలాంటి శ్రీక్రిష్ణుడి తత్వాన్ని చెప్పే ఈ సినిమాలో.. శ్రీక్రష్ణ భగవానుడి గొప్పతనాన్ని తెలిపే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఒక్కదాని కోసమే ప్రేక్షకులు థియేటర్లకు.. తన్మయత్వం చెందుతున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి ఈ మూవీ స్వీక్వెల్ గా భాగంగా విడుదలైన సినిమా అన్న విషయం కూడా వారికి తెలీదు.కానీ..ఈ సినిమాలోని కంటెంట్ కు కనెక్టు అయిన ఉత్తరాది వారి కారణంగా సినిమా కలెక్షన్లలో భారీగా తేడా వచ్చేసింది. ఒక్క సోమవారమే రూ.6.5కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్లు రూ.17.55 కోట్లుగా చెబుతున్నారు. కచ్ఛితంగా ఈ సినిమా ఊపు మరో వారం.. పది రోజులు ఖాయమని.. దీంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వరద పారటం ఖాయమంటున్నారు.

ఇప్పుడున్న జోష్ కొనసాగితే.. సింగిల్ డే కలెక్షన్ రూ.కోటి దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ సినిమా నిర్మాణానికి రూ.15 కోట్లు ఖర్చు అయితే.. ఇప్పటికే వచ్చిన కలెక్షన్లు ఆ మార్కును దాటేసింది. కథ చిన్నదే అయినా.. దాన్ని చెప్పిన విధానం.. అందులోకి శ్రీక్రిష్ణుడ్ని ప్రొజెక్టు చేసిన వైనం ఆకట్టుకునేలా మారింది. ఈ వారంలోనే జన్మాష్టమి వస్తున్న వేళ.. ఈ సినిమాకు మరింత క్రేజ్ ఖాయమంటున్నారు. ఆ మధ్యన అల్లు అర్జున్ పుష్ప మూవీ కనుక ఎలా అయితే అంచనాలు లేకుండా విడుదలైన కలెక్షన్ల దుమ్ము దులిపిందో..అదే తీరులో కార్తికేయ 2 ఉందన్న పోలిక పలువురి నోట రావటం గమనార్హం. ఉత్తరాదిన కార్తికేయ 2 విజయం మొత్తం క్రిష్ణుడి ఖాతాలో వేయాల్సిందే.