సెకండాఫ్ టాప్ 10 .. బాక్సాఫీస్ బాద్ షా ఎవరు?

Sun Jul 07 2019 20:00:01 GMT+0530 (IST)

ఫస్టాఫ్ ముగిసింది. విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా అనీల్ రావిపూడి తెరకెక్కించిన `ఎఫ్ 2` బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ నటించిన `మహర్షి` సక్సెస్ పెద్ద ఊరట. క్రిటిక్స్ మిశ్రమ స్పందనల నడుమ ఈ సినిమా వసూళ్లు ఫర్వాలేదనిపించాయి. మల్లేశం- బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలు సేఫ్ జోన్ సినిమాలుగా నిలిచాయన్న ముచ్చట ట్రేడ్ లో సాగింది. సెకండాఫ్ `ఓ బేబి`తో గుడ్ స్టార్ట్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.తదుపరి వరుసగా రిలీజ్ తేదీలు కన్ఫామ్ చేసుకున్న వాటిలో పలు క్రేజీ చిత్రాలు ఉన్నాయి. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వం లో తెరకెక్కిన `ఇస్మార్ట్ శంకర్`  జూలై 18న రిలీజవుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ మాస్ లోకి దూసుకెళ్లింది. రామ్ కొత్త గెటప్ తో .. నైజాం యాసతో మాస్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ రామ్ .. పూరి ఇద్దరికీ ఎంతో ఇంపార్టెంట్. ఇస్మార్ట్ శంకర్ రిలీజైన మరుసటి రోజే `కౌశల్య కృష్ణమూర్తి` రిలీజవుతోంది. తెలుగుమ్మాయి ఐశ్వర్యరాజేష్ (పరిచయం) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా `కణ` అనే తమిళ హిట్ చిత్రానికి రీమేక్. మెగా ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అటుపై విజయ్ దేవరకొండ - మైత్రి మూవీ మేకర్స్ సినిమా డియర్ కామ్రేడ్ జూలై 26న రిలీజవుతోంది. గీత గోవిందం - ట్యాక్సీ వాలా లాంటి వరుస విజయాలతో జోరుమీదున్న దేవరకొండ మరో ఛాలెంజింగ్ రోల్ లో కనిపించనున్నాడు. డియర్ కామ్రేడ్ సక్సెస్ కోసం మైత్రి సంస్థ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తోంది. అటుపై బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న రాక్షసుడు ఆగస్టు 2న రిలీజవుతోంది. కొన్ని వరుస ఫ్లాప్ ల తర్వాత సాయి శ్రీనివాస్ హోప్స్ అన్నీ ఈ మూవీపైనే. కెరీర్ లో బ్లాక్ బస్టర్ విజయం కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో.

2019 మోస్ట్ అవైటెడ్ మూవీ `సాహో` ఆగస్టు 15న రిలీజవుతోంది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ని మరో లెవల్ కి తీసుకెళ్లే సినిమాగా ప్రాచుర్యం పొందింది. ఇటు సౌత్- అటు నార్త్ ఇరువైపులా వసూళ్ల సునామీ సృష్టించే సినిమాగా సాహో పై అంచనాలు రెట్టించాయి. ప్రభాస్ - శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో దాదాపు 250కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. టీజర్ ఆకట్టుకుంది.. ట్రైలర్ తో హైప్ రెట్టింపవుతుందన్న అంచనాలున్నాయి.

వీటితో పాటు నాని- విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ మూవీ `గ్యాంగ్ లీడర్` ఆగస్టు 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. జెర్సీ లాంటి ప్రయోగాత్మక చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన నాని మరో విభిన్నమైన ప్రయోగం చేస్తున్నాడన్న టాక్ ఉంది. గ్యాంగ్ లీడర్ సినిమాపై అభిమానుల్లో అంచనాలున్నాయి. విక్రమ్ కె నానీని కొత్త పంథాలో ఆవిష్కరించనున్నాడన్నది ఎగ్జయిటింగ్ పాయింట్. కొన్ని వరుస ఫ్లాప్ లతో కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సూర్య తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు చాలానే ప్రయత్నిస్తున్నారు. అతడు నటించిన బందో బస్త్ ఆగస్టు 31న రిలీజవుతోంది. వరుణ్ తేజ్ `వాల్మీకి` పోస్టర్లు ఇప్పటికే వేడి పెంచాయి. ఓ బ్లాక్ బస్టర్ తమిళ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటిస్తుండడం మరో ఆసక్తికర ఎలిమెంట్. అలాగే సెప్టెంబర్ 6న .. శర్వానంద్ రణరంగం... సెప్టెంబర్ 13న... గోపిచంద్ చాణక్య .. రిలీజ్ కానున్నాయి. శర్వా.. గోపిలకు సక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఆ క్రమంలోనే ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. కొన్ని రిస్కులతో తీవ్రంగా గాయాల పాలైన ఆ ఇద్దరూ కోలుకుని షూటింగులు పూర్తి చేయడం ఆసక్తికరం.

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ ఖాయం చేశారని వినిపిస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్.. పోస్టర్ సహా భారీ కాస్టింగ్ ఆసక్తిని పెంచాయి. బాహుబలి స్కేల్ లో రూపొందిస్తున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ జాబితాలో ఉంది. సాహో తర్వాత తిరిగి మళ్లీ అంత ఊపు తెచ్చే సినిమా సైరా మాత్రమేనన్న టాక్ పరిశ్రమలో ఉంది. మరోవైపు ఎఫ్ 2 తో క్లాసిక్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ .. మజిలీతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమాగా `వెంకీ మామ`పై అంచనాలున్నాయి. మామ- అల్లుళ్ల రచ్చపై అభిమానుల్లో ఆసక్తికర ముచ్చట సాగుతోంది. అక్టోబర్ 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు సైలెంట్ గా రిలీజ్ లకు దూసుకొచ్చేవి మరికొన్ని ఉన్నాయి. అయితే వాటికి సంబంధించి రిలీజ్ తేదీల విషయమై సందిగ్ధత నెలకొంది. 2019 సెకండాఫ్ లో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపే సినిమాలు ఏవి? అన్నది వేచి చూడాల్సిందే.