గత రెండేళ్లుగా కరోనా కారణంగా పెద్ద సినిమాల రిలీజ్ లకు అంతరాయం ఏర్పడింది. అయితే ఆ తరువాత పసరిస్థితుల్లో మార్పులు మొదలు కావడం.. థియేటర్లు దేశ వ్యాప్తంగా 100 శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ కావడంతో గత రెండేళ్లుగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న భారీ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేశాయి. అందులో పుష్ప ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ లాంటి చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించి సౌత్ సినిమా సత్తా ఏంటో యావత్ ఇండియా వైడ్ గా చూపించాయి. రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డులని తిరగరాశాయి.
కన్నడ రాక్ స్టార్ నటించిన `కేజీఎఫ్ 2` దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో 1185 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిన ఈ మూవీ బాలీవుడ్ లో ఇప్పటికే 400 కోట్ల మైలు రాయిని దాటేసింది. ఈ మూవీతో పాటు ట్రిపుల్ ఆర్ పుష్ప కూడా భారీ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించడంతో ఇప్పడు అందరి దృష్టి సౌత్ సినిమాలపై పడింది. ఇప్పటికే పుష్ప ట్రిపుల్ ఆర్ ఫైనల్ గా కేజీఎఫ్ 2 కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న బాలీవుడ్ ఇప్పడు సౌత్ సినిమాల క్రేజీ లైనప్ చూస్తే బెంబేలెత్తిపోవడం ఖాయం అని చెబుతున్నారు.
ఈ లైనప్ లో ముందు వరుసలో వస్తున్న చిత్రం `లైగర్`. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీని వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 180 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈమూవీ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఒకేసారి షూట్ చేసిన ఈ మూవీ ద్వారా విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ చిత్రానికి బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ అపూర్వ మెహతాతో కలిసి ఈ మూవీని నిర్మించడంతో బాలీవుడ్ లోనూ ఈ మూవీకి భారీ క్రేజ్ ఏర్పడింది.
ఈ మూవీని ఆగస్టు 25న రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా మరో మూవీ మొదలైంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాని శివ నిర్వాణ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో `ఖుషీ` పేరుతో నిర్మిస్తోంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. డిసెంబర్ 23న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. అయితే హిందీ మినహా యించి సౌత్ భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీపై కూడా భారీ అంచనాలే వున్నాయి.
ఇక ఈ మూవీస్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `గాడ్ ఫాదర్` రిలీజ్ కాబోతోంది. మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` ఆధారంగా మోహన్ రాజా ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. నయనతార హీరోయిన్ సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై కూడా భారీ అంచనాలే వున్నాయి. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించడంతో దీనిపై బాలీవుడ్ దృష్టి కూడా పడింది. హిందీలోనూ ఈ మూవీని విడుదల చేసే అవకాశాలు వున్నాయి. 120 కోట్ల భారీ బడ్జెట్ తో సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 12న ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా కోహినూర్ వజ్రం నేపథ్యంలో రూపొందుతున్న జాపపద చిత్రం `హరి హర వీరమల్లు`. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలోరి మొఘల్ ఎంపైర్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. తొలిసారి పవర్ స్టార్ ఈ తరహా సినిమా చేస్తుండటం ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఇదే వరుసలో ప్రభాస్ నటిస్తున్న సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. `ఆది పురుష్` సలార్ మూవీస్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నవిషయం తెలిసిందే. `ఆదిపురుష్` రామయాణ గాథ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ క్రేజీ ప్రొడక్షన్ కంపనీ టి సిరీస్ సంస్థ నిర్మిస్తున్నా ఇందులో హీరో సౌత్ స్టార్ కాబట్టి ఈ మూవీ ని అంతా సౌత్ మూవీగానే చూస్తున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ కోసం యావత్ దేశం మొత్తం ఎదురుచూస్తోంది.
దీని తరువాత అందరి దృష్ణి `సలార్`పై పడింది. `కేజీఎఫ్ 2` దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న `సలార్`పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీని 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కోల్ మైన్స్ నేపథ్యంలో చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు 40 శాతం పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక 550 కోట్ల భారీ బడ్జెట్ తో `ప్రాజెక్ట్ కె`ని నాగ్ ఆశ్విన్ తెరకెక్కిస్తున్నారు. దీపిక అమితాబ్ బచ్చన్ కీలకంగా నిలిచిన ఈ మూవీ టైమ్ మెషీన్ తరహా కథతో రాబోతోంది. వచ్చే ఏడాది చివర్లో కానీ 2024 ప్రారంభం లో కానీ ఈ మూవీని విడుదల చేయాలనుకుంటున్నారు.
ఇదే బాటలో తమిళం నుంచి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియన్ సెల్వన్` రెండు భాగాలుగా రాబోతోంది. ఇందులో ఫస్ట్ పార్ట్ 1 సెప్టెంబర్ 30న విడుదల కాబోతోంది. తమిళంతో పాటు ఐదు భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. విక్రమ్ ఐశ్వర్యారాయ్ త్రిష కార్తి జయం రవి వంటి భారీ తారాగణంతో ఈ మూవీ రాబోతోంది. ఇదే బాటలో గుణశేఖర్ `శాకుంతలం` సుదీప్ `విక్రాంత్ రోణా`రాబోతున్నాయి. జూలైలో మొదలు కాబోతున్న `పుష్ప 2`ని వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. `పుష్ప` బాలీవుడ్ లో సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. దీంతో దీనికి సీక్వెల్ గా రానున్న `పుష్ప 2`ని దాదాపు 375 కోట్ల బడ్జెట్ తో సుకుమార్ తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇదే కాకుండా అఖిల్ ఏ జెంట్ తో పాటు పలు చిత్రాలు బాక్సాఫీస్ పై దండయాత్రకు రెడీ అవుతున్నాయి.