సింహాలను దత్తత చేసుకున్న ఉపాసన!

Sun Dec 05 2021 20:00:01 GMT+0530 (IST)

Upasana adopted lions

రామ్ చరణ్ భార్య ఉపాసన మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. చరణ్ కి సంబంధించిన విషయాలను .. తనకి సంబంధించిన విషయాలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. ఒక వైపున  అపోలో హాస్పిటల్స్ బాధ్యతను నిర్వహిస్తూనే మరో వైపున సామాజిక సేవ పట్ల దృష్టి పెడుతుంటారు. యోగా .. ఫిట్ నెస్ కి సంబంధించిన విషయాలను ఆరోగ్యం .. వైద్యం అనే అంశాలకు సంబంధించిన విషయాలను గురించిన పోస్టులు ఎక్కువగా పెడుతుంటారు. వివిధ రకాల అంశాలపై ప్రజలలో అవగాహనను పెంపొందింపజేయడానికి ఉపాసన తనవంతు కృషి చేస్తుంటారు. ఆమె లైఫ్ స్టైల్ ను పరిశీలించినవారికి ఆమెకి జంతువుల పట్ల .. పక్షుల పట్ల ఎంత ప్రేమ ఉందనేది అర్థమవుతుంది. జంతువుల సంరక్షణ మానవుల కనీస బాధ్యత అనే విషయాన్ని ఆమె ప్రచారం చేస్తుంటారు. జంతువుల రక్షణ విషయంలో ప్రజలలో అవగాహన కల్పిస్తుంటారు. వివిధ ప్రాంతాల్లోని జంతు సంరక్షణ కేంద్రాలకు ఆమె తనవంతు సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అలా తాజాగా ఆమె హైదరాబాద్ జూ లోని రెండు సింహాలను దత్తత చేసుకున్నారు.

అంటే ఇకపై ఆ సింహాలకి అయ్యే ఆహారపరమైన.. ఆరోగ్యపరమైన అన్ని ఖర్చులను ఆమె భరిస్తారన్న మాట. హైదరాబాద్ .. నెహ్రూ జూలాజికల్ పార్కులో విక్కీ - లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలు ఉన్నాయి. ఆ రెండు సింహాలను ఉపాసన దత్తత చేసుకున్నారు. ఇకపై ఆ సింహాల బాధ్యత ఆమెనే చూసుకుంటారు. ఈ విషయాన్ని జూలాజికల్ పార్క్ నిర్వాహకులు అధికారికంగా ధృవీకరించారు. ఈ సింహాల కోసం ముందుగా ఆమె 2 లక్షల రూపాయలకుగాను చెక్ ను నిర్వహాకులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. "ఇక్కడి జూలో దాదాపు 2000లకి పైగా జంతువులు ఉన్నాయి. వాటి ఆహారం .. ఆరోగ్యం విషయంలో జూ నిర్వాహకులు తీసుకునే శ్రద్ధ నాకు ఎంతగానో నచ్చింది. ఇక్కడి జంతువుల పట్ల వాళ్లంతా ఎంతో ప్రేమతో .. అంకితభావంతో పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు జూ ను పరిశుభ్రంగా ఉంచడం అంత తేలికైన పనికాదు. కానీ వాళ్లంతా కూడా అందుకోసం ఎంతగానో కష్టపడుతున్నారు. వాళ్ల సేవను అభినందించకుండా ఉండలేం" అని చెప్పుకొచ్చారు.