'అన్ స్టాపబుల్' సీజన్ 2 లిస్టులో కనిపిస్తున్న పేర్లు ఇవే!

Wed Jan 26 2022 16:04:11 GMT+0530 (IST)

Unstoppable Season 2 list

అల్లు అరవింద్ ఒక వైపున సినిమాల నిర్మాణ వ్యవహారాలను చూసుకుంటూనే మరో వైపున 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓటీటీ సినిమాలు .. వెబ్ సిరీస్ లు .. గేమ్ షోలతో ఆయన సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచే పనిలో ఉన్నారు. కొత్త  కాన్సెప్ట్ లతో ముందుకు వెళుతున్న ఆయన అందులో భాగంగా బాలకృష్ణ హోస్టుగా 'అన్ స్టాపబుల్' చేశారు. ఇంతకుముందు చిరంజీవి .. నాగార్జున హోస్ట్ గా చేశారుగానీ బాలకృష్ణ చేయలేదు. అందువలన అందరిలో ఒకరమైన ఆసక్తి పెరుగుతూ పోయింది. బాలకృష్ణ హోస్టుగా అంటే కష్టమే అనుకున్నవారు కూడా లేకపోలేదు.అలాంటి వాళ్లందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ బాలకృష్ణ ఈ టాక్ షోను పరిగెత్తించారు. నెంబర్ వన్ షోగా నిలబెట్టారు. బాలకృష్ణ ముక్కుసూటితనం ఈ కార్యక్రమానికి మైనస్ అవుతుందని కొంతమంది అనుకుంటే అదే ఈ కార్యక్రమానికి ప్రధానమైన బలంగా నిలిచింది. సక్సెస్ ఫుల్ టాక్ షోగా అభినందనలు అందుకుంది. ఫస్టు సీజన్ ను మోహన్ బాబు ఎపిసోడ్ తో మొదలుపెట్టారు. ఆ తరువాత నాని .. బ్రహ్మనందం - అనిల్ రావిపూడి రాజమౌళి - కీరవాణి .. రవితేజ .. మహేశ్ బాబు .. 'పుష్ప' .. 'అఖండ' టీమ్స్ తో చేశారు. ప్రతి ఎపిసోడ్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇక మహేశ్ బాబు ఎపిసోడ్ తో ఫస్టు సీజన్ పూర్తవుతుంది. దాంతో సెకండ్ సీజన్ ఉంటుందా .. లేదా? అనే ఆసక్తి అందరిలో మొదలవుతోంది. అయితే సెకండ్ సీజన్ ఉందనీ .. సాధ్య మైనంత త్వరలోనే దానిని మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయని అంటున్నారు. అయితే ఈ సారి సీజన్లో ఏయే సెలబ్రిటీలు హాజరు కానున్నారనేది కూడా అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. 2వ  సీజన్లో ఎవరెవరు ఈ వేదికపై సందడి చేయవచ్చుననే విషయంలో అనేక రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.

'అన్ స్టాపబుల్' ఫస్టు సీజన్ కి చిరంజీవి రాకపోవడంతో జనంలోకి వేరే సంకేతాలు వెళ్లాయి. చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడనీ .. అందువలన ఆయన రావడం కుదరలేదనే అభిప్రాయాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ సమాధానం వారికి సంతృప్తిని కలిగించడం లేదు. అందువలన సీజన్ 2 కోసం తప్పకుండా చిరంజీవిని రప్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయట. అలాగే వెంకటేశ్ .. ఎన్టీఆర్ .. సమంతతో పాటు చంద్రబాబు నాయుడిని కూడా ఈ టాక్ షోకి ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.