ప్రకాశ్ రాజ్ కి ప్రత్యామ్నాయం లేదంతే!

Wed Apr 21 2021 23:00:01 GMT+0530 (IST)

Unless there is an alternative to Prakash Raj!

ప్రకాశ్ రాజ్ .. విభిన్నమైన పాత్రలకు .. విలక్షణమైన పాత్రలకు పెట్టింది పేరు. తొలినాళ్లలో ప్రకాశ్ రాజ్ ను తెరపై చూసినవారు ఆయన యాక్టింగ్ రఘువరన్ స్టైల్ కి దగ్గరగా ఉందని అనుకున్నారు. కానీ ఆ తరువాత ప్రకాశ్ రాజ్ స్టైల్ ప్రత్యేకమనుకుని ఆయనను మరింతగా అభిమానించడం మొదలుపెట్టారు. ఎదురుగా ఎంతటి స్టార్లు ఉన్నా యాక్టింగ్ పరంగా ప్రకాశ్ రాజ్ తనదైన సత్తా చూపుతూనే ఉంటారు. పెదాలు కాస్త ముడిచి .. తలాడిస్తూ .. చూపుడు వేలు చూపిస్తూ .. కళ్లద్దాలలో నుంచి పైకి చూడటం ఆయన బాడీ లాంగ్వేజ్ గా కనిపిస్తుంది.ఇక ప్రకాశ్ రాజ్ డైలాగ్ డెలివరీ చాలా వెరైటీగా ఉంటుంది. డైలాగ్ ను ఎక్కడ విడగొట్టాలో ఆయనకి బాగా తెలుసు. విలన్ పాత్రలు చేసినా .. బిజినెస్ మెన్ పాత్రలు పోషించినా ... పల్లె పెద్దగా చక్రం తిప్పే వేషాలు వేసినా ఆ పాత్రలపై ఆయనదైన ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. విలన్ గా పాత్రల్లో ఎంత గొప్పగా ఇమిడిపోతారో .. ఒక తండ్రి పాత్రలో అంతే గొప్పగా ఆయన ఒదిగిపోతారు. ఏడాదికి డజను సినిమాల వరకూ ప్రకాశ్ రాజ్  చేస్తే అందులో సగం తెలుగు సినిమాలే ఉంటాయి. మిగతా సగంలో తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు కనిపిస్తాయి.

అయితే గతంలో మాదిరిగా ఈ మధ్య కాలంలో ప్రకాశ్ రాజ్ ఎక్కువగా కనిపించడం లేదు. అంటే ఆయన స్థాయికి తగిన పాత్రలు పడటం లేదు. ప్రకాశ్ రాజ్ చేసే ఎమోషన్స్ తో కూడిన పాత్రలు మురళీశర్మకి ఎక్కువగా వెళుతున్నాయనీ అలాగే నెగెటీవ్ షేడ్స్ తో కూడిన పాత్రలు రావు రమేశ్ కి ఎక్కువగా వెళుతున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కానీ ఇటీవల 'వకీల్ సాబ్' విడుదలైన తరువాత ప్రకాశ్ రాజ్ కి ప్రత్యామ్నాయం లేదని అంతా అనుకున్నారు. ఈ సినిమాతో మళ్లీ ఆయన ప్ర్రభావం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయాలు ఇటు ఇండస్ట్రీలోనూ .. అటు అభిమానుల్లోను వినిపిస్తున్నాయి.