విలక్షణ నటుడు చలం .. విషాదంతోనే ముగిసిన జీవితం!

Wed Jun 09 2021 09:00:01 GMT+0530 (IST)

Unknown Facts About Chalam

తెలుగు తెరపై కథానాయకుడిగా చలం స్థానం ప్రత్యేకం. ఎందుకంటే ఆయన ఎంచుకున్న కథలు .. పాత్రలు అలాంటివి. ఒక వైపున ఎన్టీఆర్ .. ఏఎన్నార్ మరో వైపున కృష్ణ .. శోభన్ బాబు హవా సాగుతుండగా తమ ఉనికిని చాటుకోవటం ఎవరికైనా కష్టమే. అలాంటి పరిస్థితుల్లో చలం తెలివిగా ఒక ప్రత్యేకమైన జోనర్ ను ఎంపిక చేసుకుని సేఫ్ గా ఆ జోనర్లో సినిమాలు చేస్తూ వెళ్లారు. తెరపై ఎప్పుడు చూసినా యాక్టివ్ గా కనిపించే పాత్రలనే చలం పోషించారు. సహజమైన నటనతో తన పాత్రలను ప్రేక్షకులకు చాలా దగ్గరగా తీసుకెళ్లేవారు.గ్రామీణ నేపథ్యంలో చలం ఎక్కువ సినిమాలు చేశారు. తమ మధ్యలో నుంచి ఆ పాత్రలు పుట్టినట్టుగా ఉండటంతో ప్రేక్షకులు వెంటనే వాటికి కనెక్ట్ అయ్యేవారు. గ్రామీణ వాతావరణం .. అక్కడి పెద్దల అరాచకాలు .. వాళ్లపై తన తిరుగుబాటు .. ఇలా ఆయన కథలు సాగేవి. అందువలన మాస్ ఆడియన్స్ నుంచి ఆయనకి కావలసిన మద్దతు లభించింది. ఒకానొక దశలో చలం సినిమా అంటే అది కచ్చితంగా హిట్టే అనే టాక్ వచ్చేసింది. అంతలా ఆయన సినిమాలు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాయి.

కథాకథనాలపై చలానికి మంచి పట్టు ఉంది .. అలాగే పాటలపై కూడా ఆయనకి మంచి అవగాహన ఉండేది. సినిమాకి పాటలు ప్రాణం అని భావించిన ఆయన ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు. అందువలన చలం సినిమాల్లోని పాటల్లో  దాదాపు హిట్లే కనిపిస్తాయి. అలా చలం నటుడిగా .. నిర్మాతగా ఒక వెలుగు వెలిగారు. సొంత బ్యానర్లో చేసిన కొన్ని సినిమాలు దెబ్బతినడం వలన ఆర్ధికంగా వైవాహిక జీవితంలోని ఒడిదుడుకుల వలన మానసికంగా .. మద్యం అలవాటు కారణంగా ఆరోగ్యపరంగా ఆయన ఇబ్బందులు పడ్డారు. అలా అభిమానుల మనసుకు కష్టం కలిగించే విధంగానే ఆయన జీవితం ముగిసింది.