క్లాసిక్ అవార్డుల చిత్రం తుంబాద్ కి 'కాంతారా' కాపీనా?

Sun Dec 04 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Tumbbad Director Anand Gadvi Answered About Kantara Movie

రిషబ్ శెట్టి కన్నడ చిత్రం `కాంతార` పాన్ ఇండియా కేటగిరీలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా OTTలో విడుదలయ్యాక వివాదాలు ఇబ్బందికరంగా మారాయి. ఈ మూవీకి ఎంతో కీలకమైన వరాహరూపం పాట కాపీ క్యాట్ అంటూ విమర్శలొచ్చాయి. దీనిపై కోర్టుల పరిధిలో పోరాడి చిత్రబృందం ఎట్టకేలకు విజయం సాధించింది. వరాహరూపం పాటను ఇప్పుడు ఓటీటీల్లోను సినిమాకు జత చేసారు.వాస్తవానికి వరాహ రూపం పాట విడుదలైనప్పటి నుండి అభిమానుల నుంచి గొప్ప మెప్పు పొందింది. ప్రతి ఒక్కరు పాటలోని సంగీతాన్ని పూర్తిగా ఆస్వాధించారు. యువ కథానాయకుడు రిషబ్ శెట్టిని పాన్ ఇండియన్ స్టార్ ని చేసిన చిత్రంగా కాంతార హిస్టరీలో నిలిచింది. ఈ చిత్రంలో సంస్కృతి సాంప్రదాయాలు సహా ప్రతిదీ ప్రేక్షకుల నుండి విస్తృతంగా మెప్పు పొందాయి. కథానాయకుడి పాత్ర ఎలివేషన్ పై విమర్శకులు ప్రశంసలు కురిపించారు.

కాంతార కథాంశం విస్త్రతంగా చర్చల్లోకొచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆస్వాధిస్తున్నారు. 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 1000 పైగా స్క్రీన్లలో రన్ అవుతోంది. ఆస్ట్రేలియా- యూకే- కెనడా- యూఏఈ- అమెరికాలో కూడా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. భారతదేశంలో ఈ చిత్రం ఇప్పటికీ 900 పైగా స్క్రీన్ లలో ప్రదర్శితమవుతోంది.

`కాంతార` సంస్కృతిని మేళవించిన టెక్నికల్ గ్లింప్స్ గాను గుర్తింపు పొందింది. దక్షిణ భారతదేశంలోని అరుదైన కథను తెరపైకి తెచ్చారని ప్రశంసలు కురిసాయి. ప్రజలు ఎన్నడూ చూడని లేదా విని ఉండని కథాంశం కావడంతో ఇది థియేటర్లలో సర్ ప్రైజింగ్ గా మారింది. అయితే  ఈ సినిమా హిందీ క్లాసికల్ హిట్ చిత్రం తుంబాడ్ కి కాపీ సినిమా అని కూడా ప్రచారం సాగింది. ప్రఖ్యాత దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ నిర్మించిన ఈ కళాత్మక చిత్రానికి ఆనంద్ గాంధీ దర్శకత్వం వహించారు. 2018లో వచ్చిన తుంబాద్ పలు అవార్డులు రివార్డులతో పాటు క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకుంది. ఫిలింఫేర్ - ఐఫా అవార్డులను గెలుచుకుంది. ఇది భన్సాలీ చిత్రాలను తలపించే గమ్మత్తయిన ఫీల్ తో రన్ అవుతూ ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించిన సరికొత్త కథనంతో రూపొందిన చిత్రంగా అలరించింది. ఈ చిత్రంలో కూడా జానపద నేపథ్యం ఉంది. అయితే తుంబాద్ లోని ఈ నేపథ్యం స్ఫూర్తితోనే కాంతారా కథను అల్లుకున్నారని కూడా గుసగుసలు వినిపించాయి.

ఇదే ప్రశ్నకు తాజాగా తుంబాద్ దర్శకుడు ఆనంద్ గద్వి సమాధానమిచ్చారు. ఆయన కాంతార చిత్రాన్ని ఇటీవల వీక్షించారు. దీనిపై ట్విట్టర్ లో తన స్పందనను తెలియజేసాడు. నిజానికి కాంతార చిత్రం తన చిత్రానికి చాలా దూరంగా ఉందని.. కనీస పోలికలు కూడా లేవని అతడు వ్యాఖ్యానించారు. ``కాంతారా తుంబాద్ లాంటిది కాదు. తుంబాద్ వెనుక ఉన్న నా ఆలోచన వేరు. ఒకనాటి భయానక నేపథ్యం.. సమాజంలో విషపూరితమైన మగతనం .. అహంకారం.. పక్షపాతం వంటి వాటిని సృజించాను. డబ్బాశ పేరాశను చూపించాను. కాంతారా విభిన్నమైన ఒక వేడుక`` అంటూ ప్రశంసించారు.

దీనికి నెటిజనుల నుంచి స్పందన అమోఘం. పలువురు ట్విట్టర్ లో గద్వీ అభిప్రాయంతో ఏకీభవించారు. ``సినిమాలను అర్థం చేసుకునే వారి కోణాన్ని బట్టి ఇది కూడా అర్థమవుతుంది. తుంబాడ్ కోసం మీరు చేసిన పని పూర్తిగా వేరుగా ఉంది`` అని ఒకరు వ్యాఖ్యానించారు. ``కాంతారలో కొన్ని తప్పులున్నాయి.. దేశంలో దురదృష్టవశాత్తూ సినిమా బాగా ఆడింది`` అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. తుంబాద్ భారతీయ జానపద కధల్లో ఎలాంటి సాంప్రదాయ అంశాలను స్పష్టంగా ఉపయోగించకుండానే దానికంటూ ప్రత్యేక ఆకృతిని కలిగి ఉన్న చిత్రం. ఇప్పటికీ విశ్వవ్యాప్తంగా మెప్పించే చిత్రం. కాంతార జానపద కళను ఆసరాగా చేసుకుని ఒక విజువల్ జిమ్మిక్కుగా తీసారు. ఇప్పటికీ నిస్సారమైన ఈ కథతో దోపిడీ చేస్తున్నట్టుగా కనిపించింది`` అని ఒక నెటిజన్ అభిప్రాయం తెలిపారు. ప్రేక్షకులు తుంబాద్ తో కాంతార పోల్చడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ రెండిటికీ ఎటువంటి పోలిక లేదు. తుంబాద్ బెంచ్ మార్క్ చాలా ఎక్కువ! అని మరొక నెటిజనుడు స్పందించారు.

ఫిలింమేకర్ అభిరూప్ బసు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ-``ఈ చిత్రం ఎవరి తెలివితేటలను అపహాస్యం చేస్తుందో అని నాకు అనిపిస్తోంది.పేలవమైన స్క్రిప్టుతో తీసిన చిత్రమిది. ఇందులో అసలు పాత్ర లేదు.. ప్లాట్ ట్విస్ట్ ల్లో నిజాయితీ కనిపించదు. కేవలం జిమ్మిక్కులా అనిపిస్తుంది. కథానాయకుడి నేపథ్యం అతడి విముక్తి అంశం అయితే నవ్వు తెప్పిస్తుంది. సినిమా క్లైమాక్స్ గురించి ఎక్కువగా మాట్లాడాలి. కానీ నాకు అంతగా ఆసక్తి లేదు`` అని వ్యాఖ్యానించాడు.
దైవిక జోక్యాన్ని విశ్వసించమని మిమ్మల్ని బలవంతం చేసే చిత్రమిదని.. ఇది నిజానికి దిగ్భ్రాంతిని కలిగించదు. ప్రత్యేకించి కాంతారలో పౌరాణిక పాత్ర శాస్త్రీయ ఔచిత్యాన్ని నిరూపించడానికి తీవ్రంగా ప్రయత్నించారు`` అని అన్నారు.

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన కాంతార సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. భారీ వసూళ్లను సాధించింది. దక్షిణ కన్నడలోని కాల్పనిక గ్రామం నేపథ్యంలోని చిత్రమిది. కాంతార కంబాల ఛాంపియన్ గా కనిపిస్తాడు. జానపద నేపథ్యం కొత్తగా ఆకట్టుకున్నా కథనంలోని కొన్ని లోపాలు నిరాశను కలిగించాయని విమర్శకులు విమర్శించారు.