మాస్ కి ఆన్ లైన్ టికెటింగ్ తో చిక్కులే!

Wed Nov 24 2021 19:00:01 GMT+0530 (IST)

Trouble with online ticketing to Mass People

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెటింగ్ వ్యవస్థ దిద్దుబాటు చర్యలు సర్వత్రా ఉత్కంఠ పెంచుతున్నాయి. ఇంతకుముందు సవరించిన టికెట్ ధరలతో ప్రజలంతా హ్యాపీగా థియేటర్లకు వెళుతున్నారన్న రిపోర్ట్ ఉంది. ఇష్ఠానుసారం ధరల్ని పెంచుకోవడాన్ని నియంత్రించడం ద్వారా ఒక సెక్షన్ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఒక సెక్షన్ నిర్మాతలు బాసటగా నిలుస్తున్నారు.ఇదిలా ఉంటే ఆన్ లైన్ టికెటింగ్ ని కంపల్సరీ చేస్తూ ప్రభుత్వ పోర్టల్ లో మాత్రమే టికెట్ కొనాలని సినిమాటోగ్రఫీ చట్ట సవరణ జరగడం చర్చనీయాంశమైంది. ఇకపై థియేటర్లకు వెళ్లి బారులు తీరి క్యూలైన్ లో నిలబడి టిక్కెట్లను కొనుక్కునే ఛాన్సే లేదు. ఇప్పటికే ఆన్ లైన్ అందుబాటులో ఉన్నా ఇకపై ప్రభుత్వ పోర్టల్ లోనే పూర్తిగా టిక్కెట్ల అమ్మకం జరగనుంది. అయితే ఈ వ్యవస్థ వల్ల అడ్డదారులు తొక్కే వాళ్లను నిలవరించడం సాధ్యమేనా? అంటూ చర్చ సాగుతోంది. బ్లాక్ టికెటింగ్ దందాను పూర్తిగా అరికట్టాలని అధికధరలపై ఉక్కు పాదం మోపాలని బెనిఫిట్ షోల పేరుతో దోపిడీని నిలువరించాలని ఈ కొత్త సవరణ బిల్లును ప్రవేశ పెట్టినట్టు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

అయితే సినిమా అంటే మాస్ మీడియం.. మాస్ జనాలు .. యూత్ ఎక్కువగా థియేటర్లకు వస్తుంటారు. క్లాస్ ఆడియెన్ ఎక్కువగా ఇతర మార్గాల్ని అనుసరిస్తున్నారు. పూర్తిగా పల్లెటూరి మాస్ అయితే థియేటర్లకు వచ్చి టిక్కెట్లు కొనుక్కోవడం చూసేదే. అయితే ఈసారి అన్ని సెక్షన్ల ఆడియెన్ కూడా ఆన్ లైన్ టికెటింగ్ కి అలవాటు పడాల్సిందే. ఇది మాస్ కి కొంత ఇబ్బంది కూడా. ఆన్ లైన్ సతాయింపులు కానీ.. పోర్టల్ లో కన్ఫ్యూజన్స్ ఉన్నా కానీ కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతిదీ సులువే అయినా అసలు అక్షరజ్ఞానం లేని మాస్ జనానికి ఇది కొంత ఇబ్బంది కావొచ్చు. అయితే వీలైనంత సరళంగా ప్రభుత్వ పోర్టల్ ఉంటుందని అది మాస్ కి ఉపకరిస్తుందనే భావిద్దాం. నిపుణులతో చర్చించాకే ఈ పోర్టల్ రూపకల్పన సాగుతోందని మంత్రి నాని ఇదివరకూ వెల్లడించారు.