Begin typing your search above and press return to search.

త్రివిక్రమైజేషన్: గురూజీ ప్రేరణల లీలలు!!!

By:  Tupaki Desk   |   22 April 2020 11:30 PM GMT
త్రివిక్రమైజేషన్: గురూజీ ప్రేరణల లీలలు!!!
X
మన దర్శకులు చాలామంది తమ సినిమాలకు ఎక్కడో ఒకచోట ప్రేరణలు పొందుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే. అది స్టోరీలైన్ కావచ్చు... యాక్షన్ ఎపిసోడ్ కావచ్చు.. కామెడీ సీన్ కావచ్చు.. ఓ లవ్ ట్రాకే కావచ్చు. కాదేది ప్రేరణకు అనర్హం. ఈ ప్రేరణను కొంతమంది కాపీ అని కూడా అంటూ ఉంటారు.. కొంతమంది లిఫ్టింగ్ అంటారు. అదేంటోగాని మిగతా దర్శకుల కంటే ఈ విషయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వైపే అందరూ వేలెత్తి చూపిస్తుంటారు. గురూజీ ఈ ఆర్ట్ లో ఆరితేరినవారు అని కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి. నిజానికి త్రివిక్రమ్ చేసేది కాపీ కాదని త్రివిక్రమైజేషన్ అని అని కొంత మంది నెటిజన్లు అంటూ ఉంటారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకు దాదాపు ఏదో ఒక సినిమా మూలంగా ఉంటుందనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అంతే కాకుండా గురూజీ సినిమాల్లో కొన్ని సీన్లకు మూలం హాలీవుడ్లో ఉంటుందని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు.

ఈమధ్య లాక్ డౌన్ సమయంలో జనాలకు పెద్దగా పని లేకపోవడంతో గురువుగారి ప్రేరణలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతికి పట్టుకుంటున్నారు. వీటిని మళ్లీ కాపీ అంటే గురూజీని తక్కువ చేసినట్టు ఉంటుందని స్టైల్ గా త్రివిక్రమైజేషన్ అనడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికీీీ తెలిసిన సీన్లు కాకుండా 'ఖలేజా' సినిమాలో ఒక సీన్.. 'నువ్వు నాకు నచ్చావ్'(త్రివిక్రమ్ ఈ సినిమాకు రచయిత) లో మరో సీన్ల ఒరిజినల్ చూస్తే ఫ్రేమ్ ఫ్రేమ్ కాపీ. అంతేకాదు కొంతమంది నెటిజన్లు Trivikramization అంటూ ట్విట్టర్ లో సెర్చ్ చేస్తే చాలని.. త్రివిక్రమ్ ప్రేరణలు అన్ని అందులోనే కనిపిస్తాయని సలహాలు కూడా ఇస్తున్నారు.

ఈ విషయం త్రివిక్రమ్ అభిమానులకు కాస్త కష్టంగానే ఉంటుంది కానీ నిజం నిష్టూరంగా ఉంటుందని మాత్రం మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. ఓపిక ఉంటే మాత్రం ప్రేరణలు ఎన్ని ఉన్నాయో ట్విట్టర్లో వెతుక్కోవచ్చు. ఎక్కువ రోజులు రోజులు లాక్ డౌన్ కొనసాగే కొద్దీ.. త్రివిక్రమ్ మాత్రమే కాకుండా ఇతర దర్శకులు.. సంగీత దర్శకులు ప్రేరణగా తీసుకున్నవి అన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన త్వరగా లాక్ డౌన్ ముగియాలని టాలీవుడ్ ఫిలిం మేకర్లే దేవుడికి దండం పెట్టుకోవాలేమో.