వెంకటేశ్ 75 సినిమాకి దర్శకుడిగా త్రివిక్రమ్?

Sun Apr 18 2021 22:00:01 GMT+0530 (IST)

Trivikram to direct Venkatesh 75?

వెంకటేశ్ ఎంతమాత్రం తగ్గడం లేదు .. కుర్రహీరోలతో పోటీపడుతూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒక వైపున 'నారప్ప' సినిమా షూటింగును పూర్తి చేసిన ఆయన మరో వైపున 'దృశ్యం 2' సినిమాను కూడా ముగింపు దశకు తీసుకువచ్చేస్తున్నాడు. ఇక ఆల్రెడీ 'ఎఫ్ 3' సినిమా లైన్లోనే ఉంది. ఈ మూడు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే వరుసగా ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. కాకపోతే కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ మూడు సినిమాలు బయటికి వస్తే వెంకటేశ్ 74 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసినట్టే. అంటే 75వ సినిమాకు వెంకటేశ్ సిద్ధమవుతాడన్న మాట. సంఖ్యా పరంగా 75వ సినిమాకి ప్రత్యేకత .. ప్రాధాన్యత ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ నెంబర్ పై చేసే సినిమా తప్పకుండా హిట్ కొట్టాలనే అనుకుంటారు. అలా ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలనే ఆలోచనలో వెంకటేశ్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయాన్ని గురించే ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు.

వెంకటేశ్ కథానాయకుడిగా భారీ విజయాలను అందుకున్న 'నువ్వు నాకు నచ్చావ్' .. 'మల్లీశ్వరి' సినిమాలకి త్రివిక్రమ్ రచయితగా పని చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా వెంకటేశ్ కెరియర్లో ముందు వరుసలో కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య వెంకటేశ్ తో ఒక సినిమా చేయనున్నట్టు త్రివిక్రమ్ చెప్పాడుగానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తన తాజా చిత్రాన్ని మహేశ్ తో చేయనున్న త్రివిక్రమ్ ఆ తరువాత సినిమాను వెంకటేశ్ తోనే చేయనున్నాడని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.