పాన్ ఇండియాకు దూరంగా ఉంటున్న ఒకే ఒక్క టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..!

Wed Jan 26 2022 21:00:01 GMT+0530 (IST)

Trivikram says NO to pan India subject for Mahesh

టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న ప్రతి ఒక్క దర్శకుడి ఫైనల్ డెస్టినేషన్ ఇప్పుడు పాన్ ఇండియా అనే చెప్పాలి. ఒక్క తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోడానికే ట్రై చేస్తున్నారు. ఇప్పటికే పలువురు డైరెక్టర్స్ పాన్ ఇండియా దర్శకులుగా మారిపోయారు.రామ్ గోపాల్ వర్మ - రాజమౌళి - సుకుమార్ - పూరి జగన్నాథ్ - సుజీత్ - రాధాకృష్ణ కుమార్ వంటి చాలా మంది తెలుగు దర్శకులు పాన్ ఇండియా దర్శకులు అనిపించుకున్నారు. కొరటాల శివ - సందీప్ రెడ్డి వంగా - నాగ్ అశ్విన్ - క్రిష్ జాగర్లమూడి - గౌతమ్ తిన్ననూరి వంటి మరికొందరు దర్శకులు ఈ జాబితాలోకి చేరబోతున్నారు.

అయితే నిన్న మొన్నొచ్చిన కుర్ర దర్శకులు కూడా ఇప్పుడు పాన్ ఇండియా కోసం ప్రాకులాడుతుంటే.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన త్రివిక్రమ్.. కేవలం తెలుగుకు మాత్రమే పరిమితమయ్యే కథలు రాసుకుంటూ వస్తున్నారు.

ఇప్పుడు తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా మూవీ అనే విధంగా పరిస్థితులు మారిపోయాయి. భాషతో ప్రాంతంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా మన సినిమాలను ఆదరిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే దర్శకులు అందరూ పాన్ ఇండియా అప్పీల్ ఉండే కథలను రెడీ చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాన్ ఇండియా మూవీ చేయాలనే డిమాండ్స్ ఫ్యాన్స్ నుంచి వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ వైడ్ సత్తా చాటడానికి అన్ని అర్హతలున్న దర్శకుడు.. కేవలం తెలుగు భాషకు పరిమితం కాకూడదని అభిప్రాయపడుతున్నారు. ఇకపై చేయబోయే సినిమాలను మల్టీలాంగ్వేజెస్ లలో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబుతో హ్యాట్రిక్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది యాక్షన్ జోనర్ లో రూపొందే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే SSMB28 చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా చేసే సాధ్యాసాధ్యాలపై ఆలోచన చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ఆ మధ్య ట్విట్టర్ స్పేస్ లో తెలిపారు. ఇదే జరిగి మహేష్ సినిమాతో త్రివిక్రమ్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారే విధంగా ముందడుగు వేస్తారేమో చూడాలి.