స్టార్ డైరెక్టర్ ఇప్పట్లో చిన్న హీరోలతో సినిమా చేయకపోవచ్చు..!

Thu Oct 29 2020 08:00:06 GMT+0530 (IST)

Star director may not make a movie with small heroes now ..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురంలో' సినిమాతో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే పది నెలలు గడుస్తున్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోయాడు. నిజానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా ప్రకటించాడు త్రివిక్రమ్. కానీ తారక్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. అదే సమయంలో కరోనా వచ్చి మరింత గ్యాప్ వచ్చేలా చేసింది. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఎన్టీఆర్ తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేయడానికి చాలా టైం పట్టనుంది. దీంతో త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. అందులోనూ మహేష్ కూడా వీరి కాంబోలో త్వరలోనే ఓ మూవీ ఉండబోతున్నట్లు ప్రకటించాడు. కాకపోతే మహేష్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' స్టార్ట్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నాడు. ఇది పూర్తయితే కానీ త్రివిక్రమ్ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. ఈ క్రమంలో త్రివిక్రమ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఓ సినిమా చేయనున్నట్లు న్యూస్ వచ్చింది.రామ్ పోతినేని ఇటీవల త్రివిక్రమ్ ఓ కథను చెప్పగా వెంటనే ఓకే చేసాడని.. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందని చెప్పుకున్నారు. లాక్ డౌన్ కంటే ముందే కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' మూవీని పూర్తి చేసిన రామ్.. ఇంతవరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో త్రివిక్రమ్ - రామ్ కాంబినేషన్ లో మూవీ రావడం నిజమేనని అందరూ అనుకున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ చిన్న హీరోలతో సినిమాలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ స్టార్ హీరోల కోసం స్క్రిప్ట్స్ రెడీ చేసుకుంటున్నాడట. వాస్తవానికి 'నువ్వే నువ్వే' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన త్రివిక్రమ్.. ఒక్క నితిన్( అ ఆ) మినహా మరో చిన్న మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయలేదు. స్టార్ హీరోలైన మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ - అల్లు అర్జున్ లతో మాత్రమే సినిమాలు తీసాడు. ఇప్పుడు కూడా ఇదే పద్ధతిలో వెళ్లనున్నాడని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.