బన్నీ ఇంకా గొప్ప సినిమాలు తీయాలి: త్రివిక్రమ్

Mon Jan 20 2020 16:58:21 GMT+0530 (IST)

Trivikram About Alluarjun

మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయనతో పనిచేసిన హీరోలు ఆయన తో  క్లోజ్ ఫ్రెండ్స్ గా మారిపోతుంటారు. త్రివిక్రమ్ కూడా తన దర్శకత్వంలో నటించిన హీరోల పై ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. ఈసారి ఆ అభిమానం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై చూపించారు.నిన్న విశాఖపట్నంలో జరిగిన 'అల వైకుంఠపురములో' సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ పై ప్రశంసల జల్లు కురిపించారు. "ఈ సినిమాలో అల్లు అర్జున్ బంటు పాత్రను గొప్ప పరిణతితో పోషించాడు. షూటింగ్ సమయంలోనే అది మేము గమనించాము. మానిటర్ లో బన్నీ నటన చూసినప్పుడు మేము ఎలా ఎగ్జైట్ అయ్యామో ఏం అనుభూతికి లోనయ్యమో ఇప్పుడు ప్రేక్షకులు కూడా అదే రకమైన అనుభూతిని పొందడం మాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఈ సినిమాలో బన్నీ ఎక్కడా కనిపించలేదు. బంటూ పాత్రను ముందు పెట్టి బన్నీ వెనక నిలుచున్నాడు. బన్నీ ముందు నిలబడి బంటూను వెనక్కు తోయలేదు. ఇది చాలా పరిణతి తో చేయాల్సిన ఫీట్. ఒక కమర్షియల్ హీరోకి రేజర్ ఎడ్జ్ మీద ఉండే ఫీట్. కొంచెం అటైనా కొంచెం ఇటైనా అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది. ఇంత రిస్క్ ను బలంగా నమ్మి ఇక్కడిదాకా తీసుకొచ్చాడు. తెలుగు సినిమాను బన్నీ ఎక్కడికో తీసుకెళ్తాడు అని నాకు నమ్మకం ఉంది. ఆయన సినిమాను ఎంత ప్రేమిస్తాడో నాకు తెలుసు కాబట్టి అంత బలమైన సినిమాలు.. గొప్ప సినిమాలు మన నేల నుంచి తీసి ప్రపంచం నలుమూలలకు చెప్పే శక్తిని ఆయనకు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను" అన్నారు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ ఉంటే.. అటు అరవింద్ గారు.. ఇటు అల్లు అర్జున్ చిరునవ్వులు నవ్వుతూ విన్నారు. ఇక బన్నీ అయితే 'థ్యాంక్ యూ' అన్నట్టుగా రెండు చేతులు జోడించారు. ఏదేమైనా 'అల వైకుంఠపురములో' అల్లు క్యాంప్ కు ఫుల్ జోష్ తీసుకొచ్చింది.