అందం నేర్చిన అభినయమే త్రిష!

Tue May 04 2021 09:00:02 GMT+0530 (IST)

Trisha is a beauty learned performance!

త్రిష' రెండే అక్షరాలు .. అందం అనే రెండు అక్షరాలకు అది ముద్దు పేరు. రెండు అక్షరాల ఈ అందం రెండు దశాబ్దాలుగా వెండితెరపై వెలుగుతూనే ఉంది .. కుర్రాళ్ల మనసు మైదానంలో కొంటె చూపులు నాటుతూనే ఉంది. త్రిష కళ్లు చిన్నవే .. పెద్ద రంగు కూడా కాదు .. భారీ అందాలకు కూడా బహు దూరమే. అయినా ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. బహుషా అది ఆమె నవ్వులో నుంచే పుట్టి ఉంటుందేమో. తెరపై ఆమె బుంగమూతి పెట్టేసి అలిగితే ... సీట్లలో నుంచి దాటుకుంటూ వెళ్లి ఓదార్చాలనిపిస్తుంది. ఒక హీరోయిన్ దూసుకుపోవడానికి కుర్రాళ్ల నుంచి ఈ మాత్రం సపోర్ట్ చాలదూ!త్రిష తమిళ సినిమాలు ద్వారా పరిచయమైనా తెలుగులో సూపర్ హిట్ కొట్టడానికి ఆమె ఎక్కువ సమయం తీసుకోలేదు. 'వర్షం' సినిమాతో తెలుగులో ఆమె కెరియర్ కి శంకుస్థాపన జరిగిపోయింది. అది మొదలు ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. పిల్లగాళ్ల మనసులపై ఫిడేలు రాగాలు పలికించింది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' .. 'అతడు' .. 'స్టాలిన్' .. 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' .. 'కృష్ణ' . 'నమో వెంకటేశాయ' సినిమాలతో వీలైనంతవరకూ విజయాలను తనచుట్టూ తిప్పుకుంది. అమ్మడి అందానికీ .. అభినయానికి జడిసి పరాజయమనేదే పక్కకి తప్పుకుంది.

అందం కొన్నేళ్లు ఉంటుంది .. అదృష్టం మాత్రం కొన్నాళ్లే ఉంటుంది. త్రిష విషయంలోను అదే జరిగింది. తెలుగులో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె తమిళ సినిమాలపై పూర్తి దృష్టి పెట్టింది. అక్కడ ఆమె వరుస సినిమాలతో బిజీగానే ఉంది. నాయిక ప్రాధాన్యత కలిగిన కథలను ఒప్పుకుంటూ నయనతార తరువాత తన పేరు గుర్తుకు వచ్చేలా చేసుకుంది. రజనీకాంత్ .. కమల హాసన్ .. చిరంజీవి .. మోహన్ లాల్ వంటి సీనియర్ స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఒక హీరోయిన్ సాధించిన సక్సెస్ కి నిదర్శనంగా ఇంతకంటే చెప్పుకోవడానికి ఏముంటుంది? ఈ రోజున త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిద్దాం!