బాప్ రే! డెడ్ సీజన్ లో టాప్ -7 రిలీజెస్!!

Sun Feb 21 2021 17:00:01 GMT+0530 (IST)

Top 7 Releases in the Dead Season

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే బిడ్డడు పుడతాడని ఓ సామెత. కరోనా క్రైసిస్ తర్వత టాలీవుడ్ కి అలానే కలిసొస్తోంది. దేశం మొత్తం ఇటే చూసేంతగా వెలిగిపోతోంది టాలీవుడ్. ఫీల్ గుడ్ టీజర్ల మాదిరి వరుస పెట్టి పాజిటివ్ ఫీల్ పుట్టించేయడం అందరికీ షాకిస్తోంది. ఉప్పెన గ్రాండ్ సక్సెస్ తో టాలీవుడ్ నిర్మాతల్లో పరిపూర్ణ నమ్మకం కలిగింది. ఇక ఇదే హుషారులో ఫిబ్రవరి - మార్చి సీజన్ ని అస్సలు వదిలిపెట్టడం లేదని తాజా సన్నివేశం చెబుతోంది.నిజానికి మార్చి అంటేనే డెడ్ సీజన్. పరీక్షల షెడ్యూళ్లతో స్టూడెంట్స్ ఎవరూ థియేటర్ల వైపు రారు. అయితే అలాంటి ఈ సీజన్ ఊహించని విధంగా ప్యాక్ అవ్వడం తాజాగా చర్చకు వచ్చింది. ఈ సీజన్ లో వరుస సినిమాలతో జాతరే జాతర కానుంది.

నవీన్ పోలిశెట్టి వర్సెస్ శర్వానంద్ వర్సెస్ శ్రీవిష్ణు వర్సెస్ కార్తికేయ వర్సెస్ మంచు విష్ణు వర్సెస్ ఆది సాయికుమార్ - ఇదీ సన్నివేశం. వాస్తవానికి వీళ్ల మధ్య వార్ ఏంటి..! సిల్లీ కదా అనుకోవచ్చు..! కానీ కోవిడ్ వచ్చి అందరి జాతకాలు మార్చేసింది.

నిజానికి మార్చి రెండు మూడు వారాలు సినిమా వాళ్లకి డెడ్ సీజన్. రెగ్యులర్ సన్నివేశంలో యేటేటా ఇది పరీక్షల సీజన్ కాబట్టి ఆ రెండు వారాలు సినిమాలు రిలీజ్ చేయడానికి అంతా వెనకడుగు వేస్తుంటారు..! కానీ కోవిడ్ కారణంగా మార్చిలో జరగాల్సిన పరీక్షలు జూన్ కి వాయిదా పడటంతో ఈ ఏడాది మార్చి హాట్ కేకులా మారింది.

సినిమా విడుదలైతే చాలు చూడటానికి ప్రేక్షకులు ఊపు మీద ఉన్నారు. దీంతో మార్చి రెండు మూడు వారాల్లో సినిమాలు క్యూ కట్టాయి..! మార్చి 11న శివరాత్రి సందర్భంగా 4 సినిమాలు విడుదలవుతున్నాయి. ఇందులో కన్నడ స్టార్ హీరో దర్శన్ సినిమా కూడా ఉంది. ఆ తరువాత వారం మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. మొత్తంగా డెడ్ సీజన్ లో 7 క్రేజీ సినిమాలు విడుదలవుతున్నాయి.

ఇందులో అందరి ఫెవరేట్ గా శర్వానంద్ `శ్రీకారం` విడుదలవుతుంటే ఆ తరువాత స్థానాల్లో జాతి రత్నాలు- చావు కబులు చల్లాగా ఉన్నాయి. ఇక ఆది సాయికుమార్ నటించిన `శశి` సినిమాకు ఏకైక ప్లస్ పాయింట్ గా ఒకే ఒక లోకం పాట ఉంది. ఈ సినిమాకు ఆ పాట ఒపెనింగ్స్ తీసుకురావచ్చే అవకాశం ఉందని అంచనా. డెడ్ సీజన్ అనుకుంటే గోల్డెన్ సీజన్ గా మారింది మార్చి. ఈసారి రేస్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.