'హ్యాపీ బర్త్‌డే' టీంకి టామ్ క్రూజ్ విషెస్

Thu Jul 07 2022 16:00:01 GMT+0530 (India Standard Time)

TomCruise wishes the 'Happy Birthday' team

ఈ మధ్య కాలంలో క్రేజీ ప్రోమోలు ప్రమోషన్లతో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న సినిమా.. హ్యాపీ బర్త్‌డే. చిన్న చిత్రాలను ఎలా ప్రమోట్ చేయాలనే విషయంలో ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోందీ చిత్రం. సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా రిలీజ్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడం సవాలుగా మారిన ఈ రోజుల్లో ఇలా క్రేజీగా ఏదో ఒకటి చేస్తే తప్ప వర్కవుట్  కావట్లేదు.సినిమా ఎలా ఉంటుందో ఏమో కానీ.. ప్రమోషన్ల పరంగా మాత్రం ఈ చిత్ర బృందం అదరగొట్టేసిందనే చెప్పాలి. ఈ సినిమా ప్రచారం కోసం ఏకంగా హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్‌ను కూడా వాడేయడం విశేషం.

ఇటీవలే అతడి పుట్టిన రోజు సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే' టీం తరఫున విషెస్ చెప్పడమే కాక తెలుగులో రూ.200 కోట్ల వసూళ్ల మార్కును అందుకోవాలి అని కోరుకుంటూ ఈ సినిమా యూనిట్లోని ముఖ్యుల పేరిట రిలీజ్ చేసిన పోస్టర్ అందరి దృష్టినీ ఆకర్షించింది. క్రూజ్ వాడకం అంతటితో అయిపోలేదు. నిన్న జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కూడా ఆయన్ని బాగా వాడేశారు.

టామ్ క్రూజ్ 'హ్యాపీ బర్త్ డే' ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రాబోతున్నట్లుగా ముందు ఒక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక ఈవెంట్ మొదలయ్యాక అనివార్య కారణాల వల్ల క్రూజ్ రాలేకపోయారంటూ చిత్ర బృందానికి విషెస్ చెబుతూ క్రూజ్ ఒక వీడియో పంపారంటూ దాన్ని స్క్రీన్ మీద ప్రదర్శించారు. క్రూజ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాలూకు వీడియోకు వేరే వాయిస్ యాడ్ చేసి ఆయన తెలుగులో మాట్లాడినట్లు చూపించారు.

'హ్యాపీ బర్త్డ్ డే' ఈవెంట్‌కు రావాలనుకున్నానని.. కానీ 'మిషన్ ఇంపాజిబుల్' షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయానని.. అందుకు తనను మన్నించాలని.. మొన్ననే తనకు స్కైప్ ద్వారా నిర్మాత చెర్రీ సినిమా చూపించారని.. మైండ్ బ్లోయింగ్‌గా ఉందని.. సినిమా చూడగానే ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వస్తానని హామీ ఇచ్చానని కానీ రాలేకపోతున్నానని.. జూన్‌లోనే రిలీజ్ కావాల్సిన 'హ్యాపీ బర్త్ డే' చిత్రాన్ని తన 'టాప్ గన్ మావ్రిక్' మూవీకి పోటీ అవుతుందని భావించి తాను చేసిన విజ్ఞప్తి మేరకు వాయిదా వేశారని టామ్ క్రూజ్ చెప్పినట్లుగా చూపించి ఈవెంట్‌కు వచ్చిన వాళ్లందరినీ నవ్వుల్లో ముంచెత్తింది చిత్ర బృందం.