గాల్లో టామ్ క్రూస్ భీభత్సం!

Sat Jul 20 2019 09:26:11 GMT+0530 (IST)

Tom Cruise Top Gun: Maverick Trailer

`మిషన్ ఇంపాజిబుల్` సిరీస్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూస్. అతడి నుంచి సినిమా వస్తోందంటే అభిమానుల్లో వుండే క్రేజే వేరు. అబ్బుర పరిచే యాక్షన్ సన్నివేశాలు.. ఓహో అనిపించే భారీ ఛేజ్‌లు అన్ లిమిటెడ్. తనని ఇష్టపడే ఆడియన్స్‌ని మరింత ఎగ్జయిట్ మెంట్ కి గురిచేయాలని యాక్షన్ సన్నివేశాల్లో ఎలాంటి డూప్ లు లేకుండా తానే ప్రాణాలకు తెగించి నటిస్తుంటాడు. అలా తన సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న టామ్ క్రూస్ గత చిత్రం `మిషన్ ఇంపాజిబుల్ ఫాలౌట్` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.దీంతో తనని అమితంగా ఇష్టపడే వారికి సర్ ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు టామ్. 34 ఏళ్ల క్రితం తానే నటించిన  `టాప్ గన్` చిత్రానికి `టాప్ గన్-మావరిక్` పేరుతో సీక్వెల్ తీస్తున్నారు. ఇందులో టామ్ క్రూస్ రూడ్ బిహేవియర్ గల పైలెట్ గా  కనిపించి తన విన్యాసాలతో ఆశ్చర్య పరచబోతున్నాడు. ఈ చిత్రాన్ని తన గ్రాఫిక్స్ మాయాజాలంతో ఆకట్టుకున్న `ట్రోన్ లెగస్సీ` ఫేమ్ జోసెఫ్ కోసిన్స్కీ 140 మిలియన్ డాటర్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పారామౌంట్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే వుంది. కొండల్ని.. సముద్రాల్ని తాకుతూ టాప్ క్రూస్ చేసే వైమానిక విన్యాసాలు సినిమాకు హైలైట్ గా నిలవబోతున్నాయి.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కాలిఫోర్నియాలో జరుగుతోంది. అక్కడే టామ్ క్రూస్ ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశాడు. ఈ ట్రైలర్ విజువల్ వండర్ గా అబ్బుర పరుస్తోంది. టామ్ క్రూస్ సినిమా అంటే కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తుంటారు. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గని రీతిలో ట్రైలర్ ని కట్ చేసిన తీరు సినిమాపై భారీ అంచనాలని పెంచేస్తోంది. ఈ సినిమాతో టామ్ క్రూజ్ భారీ సంచలనాలకు తెరలేపబోతున్నట్టు అర్థమవుతోంది. గత చిత్రాలకు మించి ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ అధికంగా వుంటాయని టామ్ చెబుతున్నారు. అమెరికన్ ఏవియేషన్ కి అంకితమిచ్చిన ఈ సినిమా చిత్రీకరణ కోసం ముందు అమెరికన్ ప్రభుత్వం ఏవియేషన్ ఫ్లైట్ ని వాడేందుకు అంగీకరించలేదట. ఆ తరువాత అంగీకరించినట్లు చెబుతున్నారు. అబ్బుర పరిచే విన్యాసాలతో విజువల్ వండర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది జూన్ 26న పారామౌంట్ పిక్చర్స్ సంస్థ విడుదల చేయబోతోంది.