ఇంకా ఎన్నాళ్లు ఈ ఎదురు చూపులు వంశీ గారు..!

Mon May 16 2022 13:06:45 GMT+0530 (IST)

Tollywood director krishna vamsi on rangamarthanda

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సాలిడ్ సక్సెస్ ను దక్కించుకుని చాలా సంవత్సరాలు అయ్యింది. ఆయన మళ్లీ మునుపటి ఫామ్ కు వస్తాడు.. ఆయన నుండి అద్భుతమైన కళాఖండాలు చూస్తామని ఆయన అభిమానులు నమ్మకంతో ఉన్నారు. కళాఖండాలు ఏమో కాని కనీసం సాధారణ సినిమాలు కూడా ఆయన నుండి రావడం లేదు అంటూ సాధారణ సినీ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.కృష్ణవంశీ గత చిత్రం విడుదల అయ్యి ఏళ్లకు ఏళ్లు అవుతుంది. ఇప్పటి వరకు తదుపరి సినిమాను విడుదల చేయలేదు. క్రియేటివ్ డైరెక్టర్ కాస్త మొదటి సారి రీమేక్ సినిమాకు సిద్దం అయ్యాడు. సరే తనేదైనా కొత్తగా ట్రై చేస్తాడేమో అంటూ ఆ రీమేక్ కోసం కూడా అభిమానులు మరియు సినీ ప్రేమికులు దాదాపు నాలుగు ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

రాజమౌళి సినిమా కోసం ఎదురు చూసినట్లుగా కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సరే రెండేళ్ల పాటు కరోనా వల్ల సినిమా ముందుకు సాగలేదు. మరి ఇప్పటికైనా సినిమా ను విడుదల చేయాలి కదా.. ఆ మద్య షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టినట్లుగా స్వయంగా సోషల్ మీడియా ద్వారా యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. కాని మళ్లీ షూటింగ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

షూటింగ్ ముగిసింది అన్న తర్వాత మళ్లీ షూటింగ్ చేశారు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సరే సినిమా గురించి కొన్ని పుకార్లు వచ్చినా... నెగిటివ్ వార్తలు వచ్చినా కూడా ఒక వర్గం వారు కృష్ణవంశీని అమితంగా ఇష్టపడుతారు. అందుకే వారు రంగమార్తాండ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అది కాకుండా రంగ మార్తాండ ఒక విభిన్నమైన సినిమా గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

మరాఠి మూవీ నటసామ్రాట్ కు రీమేక్ అన్నట్లుగా రంగ మార్తాండ రూపొందింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా లో బ్రహ్మానందం.. రాహుల్ సిప్లిగంజ్.. శివాత్మిక.. అనసూయ ఇంకా పలువురు నటీ నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. దాంతో సినిమా పై జనాల్లో ఆసక్తి పెరిగింది.

సినిమా గురించి ఎక్కువ వార్తలు రావడంతో అంచనాలు పెరిగాయి. కాని సినిమా మరీ ఆలస్యం అవుతుండటంతో ప్రేక్షకులు అసంతృప్తితో ఉన్నారు. నాలుగేళ్లుగా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎప్పటికి సినిమాను విడుదల చేస్తారు అనే విషయంలో కృష్ణవంశీ క్లారిటీ ఇవ్వాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఓటీటీ నుండి ఆఫర్ వస్తుందని.. కృష్ణవంశీ ఆ విషయంలో ఆసక్తిగా లేరని థియేటర్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. థియేటర్ రిలీజ్ ఎప్పుడు ఉండేది మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ ను ఇవ్వలేదు కనుక ఈ ఏడాది చివరి వరకు సినిమా విడుదల కోసం ఆగాల్సి రావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.