Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఏమి చెబుతోంది..?

By:  Tupaki Desk   |   1 Aug 2021 12:30 AM GMT
టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఏమి చెబుతోంది..?
X
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత, వెంటనే థియేటర్లలో సినిమాలను విడుదల చేయడానికి చాలా మంది ఫిలిం మేకర్స్ వెనకడుగు వేశారు. సినిమాలు చూడటానికి జనాలు థియేటర్లకు వస్తారా లేదా అనుమానంతో పెద్ద హీరోలు - నిర్మాతలు ఎవరూ ధైర్యం చేయలేదు. ఇలాంటి సమయంలో సత్యదేవ్ 'తిమ్మరుసు' - తేజ సజ్జ 'ఇష్క్' నాట్ ఏ లవ్ స్టోరీ చిత్రాలు డేర్ చేసి ముందుకు వచ్చాయి. వీటితో పాటు మరో మూడు చిన్న సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చాయి. ఈ శుక్రవారం (జూలై 30) రీ ఓపెన్ అయిన టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణాలో 100 శాతం ఆక్యుపెన్సీతో ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ తెరుచుకున్నాయి. ఏపీలో కర్ఫ్యూ కారణంగా సెకండ్ షో లకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'తిమ్మరుసు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ.20 లక్షల షేర్.. 'ఇష్క్' సినిమాకు రూ.15 లక్షల షేర్ వచ్చినట్టు టాక్. దీనిని బట్టి చూస్తే జనాలు సినిమా కోసం థియేటర్లకు రావడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుందని.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ రిస్క్ చేయడం లేదనేది అర్థం అవుతోందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.

'తిమ్మరుసు' సినిమా తొలి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకోగా.. 'ఇష్క్' చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ డే బాక్సాఫీస్ రిపోర్ట్ చూసి ఈ సినిమాలకు రాబోయే రోజుల్లో కష్టమనే టాక్ వచ్చింది. అయితే ఈరోజు శనివారం, రేపు ఆదివారం వసూళ్ళు పుంజుకునే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. అదే సమయంలో సత్యదేవ్ - తేజ సజ్జ చిన్న హీరోలు కావడం.. అందులోనూ రెండూ రీమేక్స్ అవడం వల్ల కూడా జనాలు ఆసక్తి చూపించలేదని అంటున్నారు. అలానే పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తే పరిస్థితి వేరే విధంగా ఉండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పెద్ద సినిమాలు థియేటర్లలోకి వస్తే భారీ ఓపెనింగ్స్ ఆశించవచ్చని అంటున్నారు.

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత 'క్రాక్' సినిమా వచ్చి బాక్సాఫీస్ కు మంచి స్టార్ట్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా సత్తా చాటాయి. ఇప్పుడు కూడా అలాంటి ఓ పెద్ద సినిమా వస్తే వరకు, ప్రేక్షకులు థియేటర్ల వైపు నడిచే అవకాశం లేదని అంటున్నారు. ఏదేమైనా ఈ రెండు సినిమాలకు వీకెండ్ లో వచ్చే వసూళ్లను బట్టి, నిర్మాతలు ఆగస్ట్ లో పెద్ద సినిమాలు విడుదల చేయాలా వద్దా అనే నిర్ణయానికి వస్తారనే చర్చలు ఫిలిం సర్కిల్స్ లో జరుగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో జనాలను థియేటర్లకు రప్పించే సినిమా ముందుగా ఏది వస్తుందో చూడాలి.