బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్.. యువ హీరో కెరీర్ పై ప్రభావం పడుతుందా..?

Sat Jun 25 2022 12:00:01 GMT+0530 (IST)

Tollywood Young Hero with Flop Films

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ఆరంభించిన కిరణ్.. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 'ఎస్ ఆర్ కల్యాణ మండపం' చిత్రంతో కమర్షియల్ హిట్ కొట్టాడు.బ్యాక్ టు బ్యాక్ రెండు విజయాలు అందుకోవడంతో కిరణ్ అబ్బవరం కు వరుస ఆఫర్స్ వచ్చి పడ్డాయి. అది కూడా గీతా ఆర్ట్స్ - మైత్రీ మూవీ మేకర్స్ - ఏఎం రత్నం మెగా సూర్య మూవీస్ వంటి బడా ప్రొడక్షన్ హౌసెస్ లో సినిమాలు చేసే అవకాశం అందుకున్నాడు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం టాలెంట్ మరియు హార్డ్ వర్క్ తోనే కిరణ్ ఈ క్రేజ్ సొంతం చేసుకున్నాడని చెప్పాలి. అయితే ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రెండు పరాజయాలు ఎదురవడంతో అతని కెరీర్ మీద ప్రభావం పడుతుందేమో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కిరణ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చేసిన 'స్టెబాస్టియన్ PC 524' సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.

లేటెస్టుగా 'సమ్మతమే' అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. రిలీజ్ కు ముందు ప్రమోషనల్ కంటెంట్ తో బాగానే సందడి చేశారు.

అయితే శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన తర్వాత 'సమ్మతమే' చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. దీనికి తగ్గట్టుగానే ఒపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ లో యావరేజ్ రెస్పాన్స్ చూస్తుంటే భారీ వసూళ్లను ఎక్సపెక్ట్ చేయలేం.

ఇలా కిరణ్ అబ్బవరం నటించిన బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలు నిరాశ పరిచిచాయి. దీంతో ప్రస్తుతం అతనితో సినిమాలు చేస్తున్న నిర్మాతలు టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. వరుసగా రెండు ప్లాప్స్ రావడంతో కిరణ్ థియేట్రికల్ మార్కెట్ పై ప్రభావం చూపుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

కిరణ్ ప్రస్తుతం 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' అనే సినిమా చేస్తున్నాడు. అలానే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రంలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. ఇటీవలే ఏఎం రత్నం ప్రొడక్షన్ లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. మరి ఈ సినిమాలతో కిరణ్ అబ్బావరం సక్సెస్ అందుకుని సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.