టాప్ స్టోరి: వెటరన్ స్టార్లు ట‌్రెండు ఛేంజ్

Sat Dec 07 2019 10:00:36 GMT+0530 (IST)

Tollywood Veteran Stars Changing Their New Trend Style

కాలం మారింది. సగటు ప్రేక్షకుడి అభిరుచిలో మార్పులు వచ్చాయి. దీనికి తగ్గట్టు సినిమా మార్కెట్ కూడా మారింది. అందుకే కాలంతో పాటు మారి ట్రెండుని ఫాలో కాకపోతే ఇండస్ట్రీలో ఎంత తోపు హీరో అయినా మనుగడ సాగించడం కష్టమే. ట్రెండుకు తగ్గట్టుగా మారకపోతే బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేరని ఇటీవల చాలా సందర్భాల్లో రుజువైంది. స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి-నటసింహా నందమూరి బాలకృష్ణ- విక్టరీ వెంకటేష్- కింగ్ నాగార్జున ఆలోచనలు ట్రెండ్ కి తగ్గట్టే ఉన్నాయా? అన్నది విశ్లేషిస్తే పలు ఆసక్తికర సంగుతులే రివీలయ్యాయి.వెటరన్స్ లో విక్టరీ వెంకటేష్ ఆలోచనలు ఆల్వేస్ ట్రెండీ. ఇప్పటికే ఆయన యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్లు చేస్తున్నారు. మిగతా సీనియర్ హీరోలంతా సోలోగా బరిలోకి దిగుతూ ఆపసోపాలు పడుతున్న సమయంలోనే వెంకటేష్ ఎంతో తెలివిగా సేఫ్ గేమ్ ప్లాన్ చేశారు. ట్రెండ్ ని పట్టుకుని కొత్త దారిలో బండిని లాగించేస్తున్నారు. వెంకీ ఇటీవలి కాలంలో యంగ్ హీరోలతో జట్టుకట్టి ట్రెండీ బ్లాక్ బస్టర్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. వరుణ్ తేజ్ తో కలిసి `ఎఫ్2` చిత్రంలో నటించిన వెంకీ ఆ సినిమాతో కెరీర్ బెస్ట్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం మేనల్లుడు నాగచైతన్యతో కలిసి `వెంకీమామ` చిత్రంలో నటిస్తున్నారు. ఈనెల 13న రిలీజవుతున్న ఈ సినిమాపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలే వున్నాయి.

వెంకీ బాటలోనే ట్రెండీగా ఆలోచిస్తూ నవతరంతో కలిసి నటించేందుకు కింగ్ నాగార్జున ఆసక్తిని కనబరుస్తున్నారు. నాగార్జున ఇప్పటికే కార్తీతో కలిసి ఊపిరి లాంటి క్లాసిక్ చిత్రంలో నటించారు. డాడ్ ఏఎన్నార్ సహా వారసులు నాగచైతన్య- అఖిల్ లతో కలిసి మనం లాంటి క్లాసిక్ లోనూ నటించారు. దేవదాస్ లో నేచురల్ స్టార్ నానీతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. మునుముందు యువహీరోలతో కలిసి మల్టీస్టారర్లు చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాత్రం వీరికి భిన్నంగా అడుగులు వేస్తూ సోలో హీరోగా నటిస్తున్నారు. అయితే ఇక పై కొరటాల చిత్రంలో ఇంపార్టెంట్ పాత్రల్లో యువ హీరోలు నటించే స్కోప్ ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. నటసింహా నందమూరి బాలకృష్ణ మాత్రం నా రూటే సెపరేటు అంటూ సోలోగానే బండి లాగించేస్తున్నారు. అయితే సరైన మల్టీస్టారర్ స్క్రిప్టు అందుబాటులోకి వస్తే గనుక బాలయ్య నవతరం హీరోలతో కలిసి నటించే వీలుందని చెబుతున్నారు. అటు తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్.. విశ్వనటుడు కమల్ హాసన్ మల్టీస్టారర్ల కు ఎంతో ఫ్లెక్సిబుల్. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇప్పటికీ చేసేందుకు వెనకాడని నైజం వారికి ఉంది.