Begin typing your search above and press return to search.

టాలీవుడ్ నెలకు రూ. 100 కోట్లు వడ్డీ కడుతోందా...?

By:  Tupaki Desk   |   6 Aug 2020 5:15 AM GMT
టాలీవుడ్ నెలకు రూ. 100 కోట్లు వడ్డీ కడుతోందా...?
X
కరోనా కారణంగా నస్టపోయిన రంగాలలో సినీరంగం ఒకటి. సినీ చరిత్రలో ఇండస్ట్రీ ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. ఇక టాలీవుడ్ లో కూడా గత నాలుగు నెలలుగా ఇండస్ట్రీ మూతబడి ఉండటంతో నష్టతీవ్రత ఎక్కువగానే ఉంది. సినిమా అనేది కోట్లతో కూడుకున్న వ్యవహారం కావడంతో నిర్మాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తెలుగులో పెద్ద సినిమాలు సుమారు 60 నుండి 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తుంటారు. అయితే అంత మొత్తం పెట్టుబడి పెట్టడానికి ప్రొడ్యూసర్స్ ఫైనాన్సియర్స్ ని ఆశ్రయిస్తుంటారు. ఇండస్ట్రీలోని చాలామంది ప్రొడ్యూసర్స్ రూ. 5 నుంచి రూ. 8 వరకు వడ్డీ చొప్పున డబ్బులు తీసుకొని.. సినిమా అమ్ముడు పోయిన తర్వాత తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో సుమారు 15 పెద్ద సినిమాలతో పాటు 20 చిన్నా చితక సినిమాలు నిర్మాణదశలో ఉన్నాయి. అయితే ఇవన్నీ 30 శాతం వరకు చిత్రీకరణ జరుపుకున్న తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు రోజురోజుకి కరోనా తీవ్రత పెరగడం చూస్తుంటే సాధారణ పరిస్థితులు ఏర్పడి ఈ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయి.. థియేటర్స్ లో బొమ్మ పడాలంటే దాదాపు మరో ఏడాది కాలం పడుతుంది. దీంతో ఇప్పటికే నాలుగున్నర కాలానికి నిర్మాతలు తెచ్చిన మొత్తానికి వడ్డీలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో నెలకు సుమారుగా 100 కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లిస్తున్నారని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు సినిమాల మీద పెట్టిన పెట్టుబడి ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి.. మరోవైపు ఫైనాన్స్ కి తెచ్చిన డబ్బులకు వడ్డీలు ఎలా చెల్లించాలో అర్థంకాక ప్రొడ్యూసర్స్ ఇబ్బందులు పడుతున్నారట.

అయితే ఇవేమీ పట్టించుకోని ఫైనాన్సియర్స్ మాత్రం నెల వడ్డీ కోసం చెప్పిన డేట్ కి కరెక్టుగా ప్రొడ్యూసర్స్ ఆఫీసుకో లేదా ఇంటికో వచ్చేస్తున్నారట. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ లోని చాలామంది ప్రొడ్యూసర్స్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్ర నిర్మాతలు మాత్రం థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారా అని ఎదురుచూసి అనవసరంగా వడ్డీలు చెల్లించడం ఎందుకులే అని భావించి తమ సినిమాలను డైరెక్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేస్తున్నారు. కానీ పెద్ద సినిమాల నిర్మాతలు మాత్రం తమ సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేయలేక.. థియేటర్స్ తెరిచే వరకు వెయిట్ చేస్తూ వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.