Begin typing your search above and press return to search.

సంక్రాంతికి ముగ్గురు 'మెగా' హీరోలు.. చివరకు బరిలో నిలిచేదెవరు..?

By:  Tupaki Desk   |   26 Jun 2022 4:39 AM GMT
సంక్రాంతికి ముగ్గురు మెగా హీరోలు.. చివరకు బరిలో నిలిచేదెవరు..?
X
టాలీవుడ్ లో సంక్రాంతి పండగను బిగ్గెస్ట్ సీజన్ గా భావిస్తుంటారు. కంటెంట్ ఎలా ఉన్నా భారీ వసూళ్లకు డోకా ఉండదు కాబట్టి.. ప్రతీ హీరో ఇదే సీజన్ లో రావాలని చూస్తుంటారు. ప్రతి ఒక్క ఫిలిం మేకర్స్ తన సినిమా అప్పుడు రిలీజ్ అవ్వాలని కోరుకుంటారు. గత రెండేళ్లుగా పాండమిక్ కారణంగా పెద్ద పండక్కి బాక్సాఫీస్ వద్ద సందడి పెద్దగా కనిపించలేదు. కానీ ఈసారి సంక్రాంతి మామూలుగా ఉండదని సూచనలు కనిపిస్తున్నాయి.

2023 సంక్రాంతి పండక్కి ఇంకా ఆరు నెలలు ఉంది. ఇప్పటి నుంచే ఫెస్టివల్ సీజన్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఒకరి తర్వాత ఒకరి కర్చీపులు వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఐదు సినిమాలు పొంగల్ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మైథలాజికల్ డ్రామా ''ఆది పురుష్''. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ప్రభాస్ నటిస్తున్న స్ట్రెయిట్ హిందీ సినిమా కావడంతో అందరిలో 'ఆదిపురుష్' పై మంచి అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతికతో రూపొందుతున్న ఈ సినిమాని పలు భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ''హరి హర వీరమల్లు''. పవన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాని, 2023 సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. అయితే అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అప్పుడెప్పుడో ప్రారంభమైన వీరమల్లు షూటింగ్ ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే కంప్లీట్ అయింది. పాండమిక్ మరియు పవన్ ఇతర కమిట్ మెంట్స్ వల్ల లేట్ అవ్వడంతో చిత్రీకరణ పెండింగులో పడుతూ వస్తోంది. దీన్ని హోల్డ్ లో ఉంచి పవన్ మరో రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. దీంతో క్రిష్ సినిమాకు పీకే మళ్లీ ఎప్పుడు సెట్స్ ఇస్తాడు.. ఎప్పుడు ఫినిష్ అవుతుంది అనే చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు స్క్రిప్టులో పవన్ చెప్పిన మార్పులు చేయనందు వల్లనే ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏదైతేనేం మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారమైతే 'హరి హర వీరమల్లు' వచ్చే సంక్రాంతి రేసులో ఉందనే అనుకోవాలి.

కోలీవుడ్ హీరో విజయ్ ను టాలీవుడ్ కు పరిచయం చేస్తూ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమా ''వారసుడు''. ఇటీవలే ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని వదిలిన మేకర్స్.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. పొంగల్ కానుకగా తెలుగు తమిళ భాషల్లో థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న RC15 మూవీ సమ్మర్ కి వెళ్ళడంతో.. 'వారసుడు' ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

భారీ బడ్జెట్ సినిమాల మధ్య మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా తన నాల్గవ చిత్రాన్ని బరిలో దింపడానికి రెడీ అయ్యారు. PVT4 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనౌన్స్ మెంట్ రోజునే 2023 సంక్రాంతి పండుగకు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడం గమనార్హం.

మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. 'మెగా154' అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. వచ్చే సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు తెలిపారు.

ఇలా సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కోసం ఇప్పటికే ఐదు సినిమాలు బెర్త్ కంఫర్మ్ చేసుకున్నాయి. చిరంజీవి - ప్రభాస్ - పవన్ కళ్యాణ్ - విజయ్ - పంజా వైష్ణవ్ తేజ్ వంటి అయిదుగురు హీరోలు బాక్సాఫీస్ వార్ కోసం రెడీ అయ్యారు. అయితే ఆసక్తికరంగా ఇందులో ముగ్గురు మెగా హీరోలే ఉన్నారు.

సాధారణంగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల మధ్య క్లాష్ లేకుండా చూసుకుంటారు. ఆ విధంగానే డేట్స్ బ్లాక్ చేసుకుంటుంటారు. ఎట్టిపరిస్థితుల్లో ఒకే టైంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండవు. ఇప్పుడు 2023 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పరిస్థితి అలానే ఉంటుంది. బరిలో మెగాస్టార్ నిలిస్తే మిగతా రెండూ వాయిదా వేసుకోక తప్పదు. మరి అప్పటికి సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో.. చివరకు పోటీలో ఏయే చిత్రాలు నిలుస్తాయో చూడాలి.