టాలీవుడ్ లో మాత్రమే ఇది సాధ్యం

Mon Aug 15 2022 14:00:01 GMT+0530 (IST)

Latest Updates About Tollywood Fili Industry

టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఇండియాలో ఏ భాష సినిమాలకు దక్కని వసూళ్లు మన తెలుగు సినిమా రాబడుతోంది. అద్భుతమైన కథలు అంటూ ఇతర భాషల్లో వస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు బొక్క బోర్లా పడుతున్నాయి. స్టార్ లు సూపర్ స్టార్ ల సినిమా లు కూడా  హిందీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయం ను మూట కట్టుకుంటూ ఉన్నాయి.బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ మరియు మరో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ లు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అత్యంత దారుణమైన ఫలితాన్ని చవి చూశారు. కేవలం ఆ హీరోలు మాత్రమే కాకుండా అక్కడ విడుదల అయిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఆశాజనకంగా వసూళ్లను రాబట్టలేక పోతున్నాయి. దాంతో ఇప్పుడు అందరి దృష్టి టాలీవుడ్ పై ఉంది.

గత వారం విడుదల అయిన కార్తికేయ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున వసూళ్లు రాబడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో వైపు అంతకు ముందు వారం విడుదల అయిన బింబిసార మరియు సీతారామం సినిమాల వసూళ్లు రెండో వారంలో కూడా కంటిన్యూ అయ్యాయి.. అవుతూనే ఉన్నాయి.

వరుసగా రెండు వారాలు  బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు దక్కించుకున్న నేపథ్యంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హంగామా నెలకొంది. ఇలా వరుసగా రెండు వారాల హంగామా కేవలం టాలీవుడ్ కే పరిమితం అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిందీ మరియు ఇతర భాషల్లో రెండు మూడు వారాలకు కూడా ఒక్క విజయం సాధ్యం అవ్వడం లేదు.

ఇలాంటి సమయంలో టాలీవుడ్ మాత్రమే మంచి విజయాలను దక్కించుకుంటూ కరోనా పరిస్థితుల నుండి బయట పడ్డట్లే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. బాలీవుడ్ మళ్లీ కోలుకుంటుందా లేదా అనే విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అత్యంత దారుణమైన వసూళ్లు అక్కడ నమోదు అవుతున్న నేపథ్యంలో భారీ సినిమాల మేకర్స్ లో వణుకు పుడుతోంది. టాలీవుడ్ లో మాత్రం బడ్జెట్ పరిమితులు లేకుండా నిర్మాతలు స్వేచ్చగా సినిమాలను నిర్మిస్తున్నారు.