Begin typing your search above and press return to search.

సుశాంత్ మొదటి వర్ధంతి: లోకాన్ని విడిచి ఏడాది గడుస్తున్నా వీడని డెత్ మిస్టరీ..!

By:  Tupaki Desk   |   14 Jun 2021 9:41 AM GMT
సుశాంత్ మొదటి వర్ధంతి: లోకాన్ని విడిచి ఏడాది గడుస్తున్నా వీడని డెత్ మిస్టరీ..!
X
బాలీవుడ్‌ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మ‌ర‌ణించి నేటికి (జూన్ 14) ఏడాది పూర్త‌య్యింది. గ‌త ఏడాది ఇదే రోజున ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్ లో ఉరివేసుకున్న స్థితిలో క‌నిపించారు సుశాంత్(34). సుశాంత్‌ నిష్క్రమణతో యావత్ సినీ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఎంతో కెరీర్ ఉందనుకున్న సుశాంత్ మరణ వార్త విని అభిమానులు తట్టుకోలేకపోయారు. యువ హీరో ఈ లోకాన్ని విడిచి ఏడాది గడిచిన సందర్భంగా సుశాంత్ ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సుశాంత్ కు న్యాయం జరగాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

టీవీ ఆర్టిస్ట్‌ గా కెరీర్‌ ప్రారంభించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. 'కై పో చెయ్' సినిమాతో బాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టాడు. 'శుద్ధ్ దేశీ రొమాన్స్' చిత్రంతో క్రేజీ హీరోగా మారిపోయిన సుశాంత్.. అతి కొద్దికాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నాడు. 'ఎంఎస్ ధోని - ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పీకే' 'డిటెక్టీవ్ బ్యోమకేష్ భక్షీ' 'సొంచీరియా' 'కేదార్ నాథ్' 'చిచోరె' సినిమాలతో మెప్పించాడు. ఈ క్రమంలో నార్త్ లోనే కాకుండా ఇటు సౌత్ లో కూడా ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అయితే 'దిల్ బేచారా' సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే మృతి చెంది అభిమానులను ఒంటరివాళ్ళను చేశాడు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ మరణం ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. బాలీవుడ్‌ లో నెపోటిజం కారణంగా అవకాశాలు రాకుండా చేసి ఆత్మహత్యకు పాల్పడేలా చేసారని ఫ్యాన్స్‌ ఆరోపించారు. అదే సమయంలో సుశాంత్ మరణంపై అనుమానాలున్నాయని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. సుశాంత్ మృతిపై ముంబై పోలీసులే కాకుండా బీహార్ పోలీసులు కూడా ద‌ర్యాప్తు చేశారు. ఆ తరువాత ఈ కేసు సీబీఐ చేతికి వెళ్ళింది. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీల కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించగా.. డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఈ కేసు దర్యాప్తులో పాల్గొంటున్నాయి.

సుశాంత్‌ సింగ్ సన్నిహితులు కుటుంబ సభ్యులు పని మనుషుల నుంచి బాలీవుడ్‌ సినీ ప్రముఖులు వరకు చాలా మందిని ఈ కేసులో విచారించారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సహా పలువురు అనుమానితుల్ని అరెస్ట్‌ చేశారు. అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే యువ హీరో మరణించి ఏడాది పూర్తయినా.. సుశాంత్‌ మృతి కేసు ఓ కొలిక్కి రాలేదు. ఎన్నెన్నో మలుపులు తిరిగిన ఈ మర్డర్ మిస్టరీ ఏమిటన్నది తేలకపోవడం అభిమానులను బాధిస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా మరోసారి #JusticeForSushantSinghRajput అని ట్రెండ్ చేస్తున్నారు. We Miss You అంటూ
#SSRDeathanniversary #Insaaf4SSR హ్యాష్ ట్యాగ్స్ తో ఆరాధ్య నటుడి జ్ఞాపకాలను స్మరించుకుంటున్నారు.

ఇకపోతే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మొదటి వర్ధంతి సందర్భంగా.. అతడి సినీ, వ్య‌క్తిగ‌త వివ‌రాల‌తో కూడిన ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. www.ImmortalSushant.com అనే పేరుతో సుశాంత్ కుటుంబ సభ్యుల సహాయంతో దీనిని రూపకల్పన జరిగింది. ఈ వెబ్‌ సైట్‌ లో సుశాంత్ సింగ్ జీవితానికి సంబంధించిన సమాచారం.. సినిమాల వివరాలు.. అతని వీడియోలు, ఫొటోలు ఉంటాయని తెలియజేశారు.