Begin typing your search above and press return to search.

థ‌ర్డ్ వేవ్ ముందు ఇండ‌స్ట్రీని కాపాడాలంటే..!

By:  Tupaki Desk   |   21 July 2021 9:30 AM GMT
థ‌ర్డ్ వేవ్ ముందు ఇండ‌స్ట్రీని కాపాడాలంటే..!
X
తెలుగు సినిమా స్టామినా ఎలాంటిదో మ‌హ‌మ్మారీ క్రైసిస్ లోనూ అంద‌రికీ అర్థమైంది. సెకండ్ వేవ్ ముందు మొద‌టి వేవ్ త‌ర్వాత‌ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన సినిమాలు కాసుల వ‌ర్షం కురిపించాయి. ఉప్పెన - జాతిర‌త్నాలు- నాంది లాంటి చిత్రాలు చ‌క్క‌ని వ‌సూళ్లు కురిపించ‌డం తో ప‌రిశ్ర‌మ ఊపిరిపోసుకుంది. ఈ విజ‌యాలు చూశాక టాలీవుడ్ కే కాదు.. ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల‌కు కొంత ఆశ పెరిగింది.

ఇప్పుడు థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తుంద‌న్న భ‌యాందోళ‌న‌ల న‌డుమ కూడా మ‌రోసారి టాలీవుడ్ అలాంటి హోప్స్ ని పెంచుతుందా లేక చేతులెత్తేస్తుందా? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. థ‌ర్డ్ వేవ్ న‌వంబ‌ర్ డిసెంబ‌ర్ నాటికి వ‌స్తుందా...? లేక 2022లో మొద‌ల‌వుతుందా..! అన్న‌దానిపైనా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.

అయితే ఇప్ప‌టివ‌ర‌కూ టాలీవుడ్ లో తెర‌కెక్కి రిలీజ్ ల‌కు రెడీ అవుతున్న సినిమాల‌న్నీ ఎంతో స్టామినా ఉన్న‌వే. చిరంజీవి- ఎన్టీఆర్-చ‌ర‌ణ్ - బ‌న్ని - ప్ర‌భాస్- నాని- రానా వంటి స్టార్లు న‌టించిన భారీ పాన్ ఇండియా చిత్రాలు బరిలో ఉండ‌డం కేజీఎఫ్ 2 లాంటి క్రేజీ చిత్రం రేసులో నిల‌వ‌డం వంటి అంశాలు హోప్ ని పెంచేవే. అయితే జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు అల‌వాటు చేసేందుకు ఏం చేస్తారు? అన్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇటీవ‌ల క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో 50శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ను తెర‌వ‌గా ఆడియెన్ మాత్రం ఇండ్ల నుంచి థియేట‌ర్ల‌కు క‌దిలి రాలేద‌ని రిపోర్ట్ అందింది. కర్నాటకలో మొత్తం 630 సింగిల్ స్క్రీన్ లు 260 మల్టీప్లెక్స్ లు ఉన్నా.. అక్క‌డ మొద‌టి రోజు కేవలం 10శాతం మాత్రమే తెరిచార‌ని తెలుస్తోంది. సెకండ్ వేవ్ ముందు ఉన్న ప‌రిస్థితి ఇప్పుడు లేక‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. అయితే క‌న్న‌డ ఇండ‌స్ట్రీ మ‌న‌కు ప్రామాణికం కానే కాదు. అక్క‌డ సినిమాల‌తో పోలిస్తే మ‌న సినిమాల స్టామినా వేరు. కంటెంట్ ప‌రంగా వేరియేష‌న్ ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే వీలుంది. అయితే నేరుగా స్టార్ హీరోల సినిమాల్ని రిలీజ్ చేసే ముందు పాత సినిమాల‌తో జ‌నాల‌కు అల‌వాటు చేయాల్సి ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల్లో 1750 థియేట‌ర్లు రెడీగా ఉన్నాయి. ఇవ‌న్నీ తెరుచుకుని 50శాతంతో ఆడినా అది నిర్మాత‌ల‌ను ఎగ్జిబిట‌ర్లు పంపిణీదారుల‌ను క్రైసిస్ నుంచి కొంత‌వ‌ర‌కూ బ‌య‌ట‌ప‌డేయ‌డం ఖాయమ‌ని విశ్లేషిస్తున్నారు.

క‌రోనాని మించి ఇత‌ర స‌మ‌స్య‌లు:

ఇక్క‌డ క‌రోనాని మించి ఇత‌ర స‌మ‌స్య‌లు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. తెలంగాణ‌లో ఈనెల 23 నుంచి థియేట‌ర్లు తెరుస్తున్నారు. పార్కింగ్ ఫీజు వెసులుబాటుతో థియేట‌ర్ య‌జ‌మానుల‌కు కొంత భ‌రోసా ల‌భించింది. ఇత‌ర వెసులుబాట్లు ప్ర‌భుత్వాలు క‌ల్పించి ఎగ్జిబిష‌న్ రంగాన్ని కాపాడాల్సి ఉంటుంది. ఇక ఏపీలో టికెట్ పెంపు విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇంకా నాన్చుడు ధోరణితో ఉండ‌డం తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తోంది. క‌నీసం క్రైసిస్ కాలానికి అయినా ప్ర‌భుత్వాలు కొంత వెసులుబాటు క‌ల్పిస్తే బావుండేద‌న్న అభిప్రాయం నెల‌కొంది.

ఇలాంటి ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల వ‌ల్ల థియేట‌ర్ల‌లోకి సినిమాని రిలీజ్ చేయాలంటేనే తెలుగు నిర్మాత‌లు వెన‌క్కి జంకుతున్నారు. థియేట‌ర్లు ఇప్ప‌ట్లో తెరుచుకున్నా జ‌నం వ‌స్తారా రారా ? అన్న సందిగ్ధ‌త‌ల వ‌ల్ల కూడా నిర్మాత‌లు త‌మ సినిమాల‌ను ఓటీటీల‌కు అప్పజెబుతున్నారు. అయితే ఈ ప‌రిస్థితి నుంచి ఎగ్జిబిష‌న్ రంగాన్ని అక్క‌డ ఉపాధి పొందుతున్న కార్మికుల‌ను కాపాడాల్సిన బాధ్య‌త ఇండ‌స్ట్రీతో పాటు ప్ర‌భుత్వాల‌పైనా ఉంద‌న్న‌ది గ్ర‌హించాలి.

టాలీవుడ్ లో వ‌రుస‌గా క్రేజీ సినిమాలు రిలీజ్ ల‌కు సిద్ధంగా ఉన్నందున ఇప్పుడే జోష్ ని పెంచేందుకు ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నిస్తే బావుండేద‌న్న అభిప్రాయం ప‌రిశ్ర‌మ‌లో వ్య‌క్త‌మ‌వుతోంది. కీల‌క నిర్ణ‌యాల్లో మునుముందు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయి? అన్న‌ది వేచి చూడాలి. ఏదేమైనా థ‌ర్డ్ వేవ్ రాక‌ముందే కొన్ని సినిమాల్ని రిలీజ్ చేయించేందుకు అధికారులు నాయ‌కుల నుంచి మంచి నిర్ణ‌యాలు వెలువ‌డ‌తాయ‌నే ఆశిద్దాం. థ‌ర్డ్ వేవ్ ముందు టాలీవుడ్ సత్తా చాట‌గ‌ల‌దు.. కానీ క‌రోనాని మించి ఇత‌ర స‌మ‌స్య‌లు పెద్ద అడ్డంకిగా మారాయి. దీనికి ప్ర‌భుత్వాలే ప‌రిష్కారం చూపుతాయ‌నే అంద‌రూ ఎదురు చూస్తున్నారు.