టైగర్ 3: కర్కోటక ISI తీవ్రవాది ఎంట్రీ సీన్ కోసం 10కోట్లు?

Fri Jul 23 2021 10:00:54 GMT+0530 (IST)

Tiger 3: 10 crores for ISI terrorist entry scene in Karkat?

స్టార్ హీరో ఎంట్రీ సీన్ కోసం నిర్మాత పెట్టే బడ్జెట్ గురించి తెలిస్తే ఒక్కోసారి గుండె ఝల్లుమంటుంది. అయితే ఆ ఒక్క సీన్ తోనే కోట్లు కురుస్తాయి. ఆహా ఓహో అనే లెవల్లో ఎలివేషన్ లేనిదే మన హీరోలు ఊరుకోరు కూడా. అందుకే నిర్మాతలు అంత రిస్క్ చేస్తారు. హీరో అంటే ఫేస్ ఆఫ్ ది ఇండెక్స్ లా.. సినిమాకి అన్నీ తనే! అందుకే తన కోసం అంత పెడితే తప్పేమీ లేదని నిర్మాతలే చెబుతారు. పోస్టర్ లో హీరోని చూశాకే ప్రేక్షకుడు థియేటర్లకు వస్తారన్నది అందరికీ తెలిసిన నగ్నసత్యం.అయితే హీరో ఎలివేషన్ సీన్ కోసం అంత ఖర్చు చేస్తే సరే కానీ.. ఇక్కడ విలన్ ఎంట్రీ సీన్ కోసం ఏకంగా 10 కోట్లు పెడుతుంటే కళ్లు భైర్లు కమ్మేస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమాలో సీన్ అది? అంటే..సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ నాయకానాయికలుగా నటిస్తున్న `టైగర్ 3`లో విలన్ ఎమ్రాన్ హష్మి ఎంట్రీ సీన్ కోసం మేకర్స్ రూ .10 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం.

ఎమ్రాన్ హష్మి ఈ చిత్రంలో పాకిస్తాన్ కి చెందిన ఐఎస్ఐ ఏజెంట్ పాత్రను పోషిస్తున్నాడు. అతడిని పాకిస్తాన్ టైగర్ అని పిలిచేస్తారట. మనీష్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా యష్ రాజ్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కేవలం ఎమ్రాన్ హస్మి ఎంట్రీ సీన్ కోసమే ఏకంగా రూ .10 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని తెలిసింది. నిజానికి సల్మాన్ ఖాన్ కి వీరోచిత పరిచయ సన్నివేశాలను తెరకెక్కించడం రివాజు . ఏక్ థా టైగర్ .. టైగర్ జిందా హై చిత్రాల్లో ఎంట్రీ సన్నివేశాలు ఇటీవలి కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. `టైగర్ 3`లో సల్మాన్ కోసం మరో వీరోచిత ప్రవేశ సన్నివేశాన్ని మేకర్స్ ప్లాన్ చేశారట. టైగర్ జిందా హైలో భారత స్వాతంత్య్ర సన్నివేశంతో  కత్రినా ఎంట్రీ ఓ రేంజులో ఉండనుందని కూడా తెలిసింది.

అదే సమయంలో ఇందులో విలన్ కి కూడా ఎలివేషన్ ఎక్కడా తగ్గదు. ఎమ్రాన్ కి ఇంతకుమించి తన జీవితంలో మరో ఎంట్రీ సీన్ ఉండదని కూడా చెబుతున్నారు.  టైగర్ 3 లో ఎమ్రాన్ హష్మి పరిచయ సన్నివేశం కోసం మనీష్- ఆది .. ఇతర స్టంట్ బృందం 10 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన యాక్షన్ సీక్వెన్స్ రూపకల్పన చేసింది. టైగర్ కి ధీటుగా శక్తివంతమైన విలన్ ని పరిచయం చేయాలనే ఆలోచన చేయడం ... ఇద్దరు టైగర్ల మధ్య యుద్ధాన్ని తలపించాలని భావించడం వల్లనే ఇంత భారీ ప్లాన్ చేశారట.

సల్మాన్ - కత్రినా ఈ రోజు నుంచి టైగర్ 3 చిత్రీకరణను యష్ రాజ్ స్టూడియోలో తిరిగి ప్రారంభించారు. ఎమ్రాన్ త్వరలో వారితో చేరాలని భావిస్తున్నారు. ఇది T3 కి భారీ షెడ్యూల్ అని తెలుస్తోంది. తదుపరి విదేశాల్లో చిత్రీకరణకు వీరంతా హాజరు కావాల్సి ఉంటుంది. ఆగస్టు 12 నుండి విదేశాలకు ప్రయాణమవుతారని తెలిసింది. విదేశాలలో ప్రధాన భాగం టర్కీలో తెరకెక్కిస్తారు. పఠాన్ తో గూఢచారి విశ్వంలో చేరిన షారూఖ్ ఖాన్ టైగర్ 3 లో కూడా అతిధి పాత్రలో నటించనున్నారు. వచ్చే నెలలో ఎస్.ఆర్.కె తన పాత్ర కోసం షూటింగు చేస్తారని తెలిసింది.