థియేటర్ యజమానుల గుడ్డెద్దు పోకడ ఫలితం!

Tue Jan 24 2023 21:00:01 GMT+0530 (India Standard Time)

Ticket Prices in Multiplex Theatres

రూ.30 ఖరీదు చేసే ఉప్మా దోశను రూ.60 కి కొనుక్కుని తినాలంటే ఎన్ని రోజులు ఇది సామాన్య మధ్యతరగతికి పాజిబుల్? ఇప్పుడు తెలుగు సినిమా మల్టీప్లెక్సులు సింగిల్ స్క్రీన్లలో టిక్కెట్టు ధరల పరిస్థతి అలానే ఉంది. మెజారిటీ ఫ్యామిలీ ఆడియెన్ థియేటర్లకు రావడం మానుకోవడానికి ఈ అహేతుక పెరుగుదల ప్రధాన కారణం. థియేటర్ల మెయింటెనెన్స్ పెరిగిందనో కరెంటు బిల్లులు పెరిగాయనో అదంతా తక్కువ సమయంలో ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తే దాని ఫలితం కూడా అనుభవించాల్సి ఉంటుందని ఇటీవల థియేటర్ల కు ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోతున్న వైనం వెల్లడిస్తోంది. పండగ సీజన్లను వదిలేస్తే.. రూ.30 ఉప్మా దోశను రూ.60 కి కొనుక్కు తినేందుకు సామాన్య మధ్యతరగతి ప్రజలు సిద్ధంగా లేరు. దానికంటే ఇంట్లోనే ఉప్మా వండుకుని ఇంటిల్లిపాదీ తినాలని బ్లైండ్ గా ఫిక్సయిపోతున్నారు. ఫలితంగా చాలా సినిమాల్ని థియేటర్లకు వెళ్లి చూడకుండా ఓటీటీలో ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇటీవలి కాలంలో వాణిజ్య ప్రకటనలతో సినిమాలను గంటల కొద్దీ సాగదీసి టైమ్ వేస్ట్ చేసే టీవీలు చూడటం కూడా ఓటీటీ రాకతో తగ్గిపోయింది.కారణం ఏదైనా థియేటర్లలో టిక్కెట్టు ధరలను పెంచాలి కానీ అత్యాశకు పోయి స్టార్ హీరోల క్రేజుతో అమాంతం అసంబద్ధమైన ధరల్ని పెంచితే జనం థియేటర్లకు వచ్చేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు. కరోనా వెళ్లిపోయినా ఇంకా దాని భయాలు కూడా పూర్తిగా వదిలిపోలేదన్నది థియేటర్ల యాజమాన్యం గుర్తెరగాలి. అనవసరమైన రిస్కులు తీసుకునే మూడ్ లో క్లాస్ ఆడియెన్ అస్సలు ఉండరు. అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు వస్తేనే లాంగ్ రన్ సాధ్యమవుతుంది. లేదంటే మూడో రోజుకే దుకాణం సర్ధేయాల్సొస్తోందన్నది గుర్తెరగాలి.

సెలవుల కారణంగా సంక్రాంతి సినిమాల వరకూ బాగానే ఆడాయి. టిక్కెట్టు ధరలతో సంబంధం లేకుండా ఇవి బాగానే వసూలు చేసాయి. కానీ ఒక వారం వరకే టిక్కెట్టు ధరలు పెంచుకోవాలని అనుమతులు ఇస్తే రెండో వారం మూడో వారం కూడా అత్యాశకు పోయి అవే పెద్ద ధరలను కొనసాగిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో కూడా థియేటర్ యాజమాన్యాలు అనుభవిస్తున్నాయి.

80ల కాలంలో 90ల కాలంలో తక్కువ టిక్కెట్టు ధరలతో ఎక్కువ రోజులు సినిమాలు ఆడించే వారు. కానీ ఇప్పుడు అలా కాదు. దోపిడీ క్రతువు తొలి మూడు రోజులకే అంకితమిచ్చారు. దీని ఫలితం సాంప్రదాయ థియేట్రికల్ వీక్షణ నాశనమై ఆ స్థానంలో తక్కువ సమయంలో ధనార్జన ఆక్యుపేషన్ విధానాలు అమలవుతున్నాయి. అహేతుకమైన విధానాలతో సాంప్రదాయ విధానం తునాతునకలు అయ్యింది. కారణం ఏదైనా ఈరోజు జనం థియేటర్లకు రావడం లేదన్న ఏడుపు ఏడవడం కూడా అనవసరం.

ఇక స్ట్రెయిట్ సినిమాల సంగతి అటుంచితే పెద్ద నగరాల్లో మల్టీప్లెక్సుల్లో  భారీ ధరలకు కొనుక్కోవాల్సిన దుస్థితి ఉంది. షారూఖ్ ఖాన్ 'పఠాన్' తెలుగు వెర్షన్ కు సింగిల్ స్క్రీన్లలో రూ.175... మల్టీప్లెక్సుల్లో రూ.295 టికెట్ ధర పెట్టి కొనాలంటే సామాన్యులకు సాధ్యమేనా? ఒక అనువాద చిత్రం.. అంతగా క్వాలిటీ లేని డబ్బింగులతో విడుదలయ్యే సినిమాల  కోసం జనం అంత రేట్లు పెట్టి కొంటారా?  పైగా కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించే విధానం ఇదేనా? అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ఎగ్జిబిటర్లు - డిస్ట్రిబ్యూటర్ల పేరాశ చాలా ప్రమాదకరమని ఎక్కువమంది ప్రేక్షకులకు ఉప్మా దోశ తినిపించేలా ప్లాన్ చేయాలని లేదా థియేటర్లకు రప్పించి సమోసాలు పాప్ కార్న్ తినిపించాలని ఆశపడుతున్నారు. ధరల్ని కనీసం రూ.150-200 రేంజులో ఉంచినా జనం థియేటర్లకు వస్తారేమో పునరాలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. థియేటర్ మెయింటెనెన్స్ కోసం ఖర్చులు ఉన్నా కానీ మరీ దోపిడీ విధానాలను అనుసరిస్తే లాంగ్ టైమ్ లో దాని ఫలితం అనుభవించేది ఎగ్జిబిటర్.. పంపిణీదారులేననేది గుర్తెరగాలి. దీనివల్ల నిర్మాతకు వచ్చే నష్టం ఏమీ ఉండదు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.