దాసరి బయోపిక్ ఇదీ నిజం

Mon Apr 15 2019 12:12:36 GMT+0530 (IST)

This Is Truth Of Dasari Narayana Rao Biopic Movie

దర్శకరత్న డా.దాసరి నారాయణరావు మరణానంతరం ఆయనపై బయోపిక్ తీస్తున్నామంటూ శిష్యులు ప్రకటించడంతో అంతా అది నిజమేనని అనుకున్నారు. అయితే దాసరి బయోపిక్ ఇదిగో పులి.. అంటే అదిగో మేక! అన్న చందంగా ఇప్పటికీ అంతూ దరీ లేనిదిగానే మిగిలిపోవడం ప్రముఖంగా ఫిలింవర్గాల్లో చర్చకు వచ్చింది. 24 శాఖల్లో ఏ సమస్య వచ్చినా నేనున్నాను! అంటూ ఆదుకునే పెద్దాయన వెళ్లగానే ఒకటి రెండు జయంతి కార్యక్రమాలు.. వర్ధంతి కార్యక్రమాలు మినహా శిష్యులు చేసిందేమీ లేదని పెదవి విరిచేస్తున్నారు. అప్పట్లో పాలకొల్లులో దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఫిలింఛాంబర్ పరిసరాల్లోనూ దాసరి విగ్రహం పెట్టారు.విగ్రహాలు పెట్టడం తప్ప బయోపిక్ తీయలేదని ఇప్పటికీ సినీవర్గాల్లో సెటైర్లు వినిపిస్తూనే ఉన్నాయి. విగ్రహాలతో గురువుగారిపై ప్రేమ ఉన్నట్టా? కనీసం ఆయన జీవితకథను నేటి తరానికి తెరపై చూపించే ప్రయత్నమైనా చేయరా?  కాలికి చెప్పులు లేకుండా మద్రాసులో అడుగుపెట్టిన దాసరి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి.. దర్శకుడుగా మారి.. అటుపై శతాధిక చిత్రాల్ని 365రోజులు ఆడిన చిత్రాల్ని తెరకెక్కించి సంచలనాలు సృష్టించారు. నటుడిగా.. రచయితగా చెరగని ముద్ర వేశారు. రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అవార్డులు రివార్డులు కోకొల్లలు. ఆయన జీవితం ఆద్యంతం ఎమోషనల్ జర్నీలా సాగింది. దానిని చూపించేందుకు ఎందుకింత నామోషీ? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. స్ఫూర్తివంతమైన ఆయన జీవితాన్ని తెరపై చూపించాలన్న ప్రయత్నం  జరిగితేనే కదా? అన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.

అయితే దాసరి బయోపిక్ గురించి అధికారికంగా ప్రకటించక పోయినా సైలెంటుగా కొన్ని ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఆయన శిష్యుల్లో ఓ సీనియర్ చెప్పిన వివరాల్ని బట్టి దర్శకరత్న దాసరి జీవిత విశేషాలతో ఓ డాక్యు సినిమా తెరకెక్కుతోంది. ఇందులో దాసరి శిష్యుడు సి.కళ్యాణ్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇది డాక్యు సినిమానా?  ఫీచర్ సినిమానా? దర్శకుడెవరు? వగైరా వివరాలు తెలియాల్సి ఉంది.

అలాగే కత్తి కాంతారావు బయోపిక్ (రాకుమారుడు) దర్శకుడు ఆదిత్య పీసీ దాసరిపై బయోపిక్ తెరకెక్కించే సన్నాహకాల్లో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సీనియర్ నటుడు కాంతారావుపై సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే తదుపరి దాసరి బయోపిక్ గురించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దాసరిపై సినిమా తీసే ప్రయత్నం చేస్తున్న వాళ్లు ఎవరో ఎవరో. మంచు మోహన్ బాబు మురళీ మోహన్ లాంటి బడా స్టార్లు సహా ఎందరో స్టార్లు ఆయనకు సన్నిహితులుగా ఉన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ రేలంగి నరసింహారావు సి.కళ్యాణ్ వంటి ప్రముఖులు దాసరికి ప్రియశిష్యులుగా ఉన్నారు. ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఎవరూ దాసరి బయోపిక్ గురించి ఆలోచించకపోవడంపైనా ప్రస్తుతం పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. బయోపిక్ ట్రెండ్ లో గురువు గారి గౌరవార్థం అయినా అలాంటి ప్రయత్నం చేయరా? అంటూ మాటా మంతీ సాగుతోంది.