Begin typing your search above and press return to search.

సినిమా ఇండ‌స్ట్రీకి ఇదే అతి పెద్ద స‌వాల్‌

By:  Tupaki Desk   |   5 April 2020 4:30 AM GMT
సినిమా ఇండ‌స్ట్రీకి ఇదే అతి పెద్ద స‌వాల్‌
X
క‌రోనా దెబ్బ‌కి టాలీవుడ్ అష్ట దిగ్భంద‌నంలోకి వెళ్లిపోయింది. లాక్ డౌన్ అవ్వ‌డంతో 24 శాఖ‌ల‌కు చెందిన సినీ కార్మికులు నానా అవస్థ‌లు ప‌డుతున్నారు. ప‌నులు లేక పూట గ‌డ‌వ‌ని స‌న్నివేశం ఎదురైంది. ఒక రోజు సెట్ లోకి వెళ్లి ఏదో ప‌ని చేస్తే ఎంత లేద‌న్నా మినిమం 500 కూలి వ‌చ్చేది. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు. దీంతో కార్మికులు ప్రస్తుతానికి ప్ర‌త్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. లాక్ డౌన్ ఉన్నంత కాలం చేతికి దొరికిన‌ ఏదో ప‌ని చేసుకుని పూట గ‌డ‌పాల‌ని చూస్తున్నారు. అయితే ఇందులో కార్మిక యూనియ‌న్ కార్డులున్న‌వారు..లేని వారు కూడా ఉన్నారు. అయితే ప్రొడ‌క్ష‌న్ లో యూనియ‌న్ కార్డులున్న వారికి ప‌ని త‌క్కువ రోజువారి వేత‌నం ఎక్కువ‌గా ఉంటుంది.

దీంతో ప్రొడ‌క్ష‌న్ కంపెనీలు త‌రుచూ కార్డు ఉన్న‌వాళ్ల‌తో పాటు యూనియ‌న్ మెంబ‌ర్ షిప్ లేని బ‌య‌టి వారిని కూడా రోజు కూలి లెక్క‌లో తీసుకుంటారు. అయితే కార్డు లేని వారికి రోజువారి వేత‌నం త‌క్కువ‌గా ఉంటుంది. ఆ విధంగా ప్రొడ‌క్షన్ కంపెనీలు కొంత సేవ్ అవుతుంది. అయితే లాక్ డౌన్ ఇప్పుడు చాలా సందేహాల‌కు దారి తీస్తోంది. ప్ర‌స్తుత స‌న్నివేశం నేప‌థ్యంలో వేరే వృత్తుల‌కు వెళ్తోన్న వారికి సినిమా ఇండ‌స్ర్టీలో వ‌చ్చే రోజువారి వేత‌నం క‌న్నా! ప్ర‌స్తుతం చేస్తోన్న వృత్తిలో ఎక్కువ‌గా సంపాదించ‌గ‌లిగితే గ‌నుక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసే అవ‌శాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వినిపిస్తోంది.

ఎన్నో ఏళ్ల నుంచి ప‌రిశ్ర‌మ‌ను..వేరు వేరు రంగాల‌ను ప‌ట్టుకుని వేలాడుతున్న అక్క‌డుండి సంపాదించిన దానిక‌న్నా...కేంద్ర -రాష్ర్ట ప్ర‌భుత్వం క‌ల్పిస్తోన్న ఉపాధి హామీ ప‌థ‌కాలు ఎంతో ఉప‌యుక్తంగా ఉంటున్నాయి అని కొంత మందిలో ఇప్ప‌టికే మార్పు తీసుకొచ్చిన‌ట్లు ఇటవ‌లే ఓ స‌ర్వే లో తేలింది. సినీ ప‌రిశ్ర‌మ విష‌యం లో ఇదే గ‌నుక‌ జ‌రిగి కార్మికులు వేరే వృత్తిని ఎంచుకుని వెళ్లిపోతే గ‌నుక నిర్మాత‌ల‌కు ఖ‌ర్చు భారం ఆకాశాన్నంటుతుంది. రూపాయి పెట్టే ద‌గ్గ‌ర రెండు రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. ప‌ని రోజులు పెరిగే అవ‌కాశాలున్నాయి. ఇవ‌న్నీ ఆలోచిస్తే నిర్మాత‌కు త‌ల‌కు మించిన భార‌మే అవుతుంన‌ద్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ విషయాలో ప‌రిశ్ర‌మ పెద్ద‌ల్లో సైతం హాట్ టాపిక్ న‌లుగుతోందట‌. ఇలాంటి ప‌రిస్థితే గ‌నుక ఎదురైతే రానున్న రోజుల్లో పెద్ద స‌వాలే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే లాక్ డౌన్ నేప‌థ్యంలో త‌లెత్తిన న‌ష్టాల‌ను ఎలా భ‌రించాల‌ని పెద్ద‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే.