పవర్ స్టార్ కి ధీటుగా నిలబడే స్టార్ ఎవరు...?

Sat Oct 31 2020 15:40:57 GMT+0530 (IST)

These Two Actors Are Keen On Sharing Screen With Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది మలయాళ 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకు తెలుగు రీమేక్ అని తెలుస్తోంది. బిజూ మీనన్ - పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. అక్కడ బిజూ మీనన్ పోషించిన శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటించనున్నాడు. అయితే ఇప్పుడు పృథ్వీరాజ్ రోల్ ఎవరు పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది.'అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍' కథ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఇగోల కారణంగా వాళ్ళ జీవితాల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఉంటుంది. ఇద్దరివి కూడా ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ధీటుగా నిలబడే పాత్రలు. అందులోనూ ఇద్దరూ ఒకరిపై ఒకరు తలపడే సన్నివేశాలు చాలానే ఉంటాయి. ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ ఒక హీరోగా నటిస్తుండగా.. ఆయనకు ధీటుగా నిలబడే మరో హీరో కోసం మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ఆ రోల్ లో దగ్గుబాటి రానా నటించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే రానా నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.

ఇదే క్రమంలో యువ హీరో నితిన్ 'కోశి' పాత్రలో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ వస్తున్న నితిన్.. ఇప్పుడు తన ఫేవరేట్ హీరో సినిమాలో అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నాడట. అలానే కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ని ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అయితే లేటెస్టుగా మెగా మేనళ్లుడు సాయి ధరమ్‍ తేజ్‍ కూడా ఈ పాత్ర పోషించాలని ఆశ పడుతున్నాడట. మరి మేకర్స్ వీరిలోఎవరిని కోషీ పాత్ర కోసం ఎంచుకుంటారో చూడాలి.