Begin typing your search above and press return to search.

స్టూడియోలు కిక్కిరిసిపోయేంత ర‌ష్ ఉంద‌ట‌!

By:  Tupaki Desk   |   25 May 2020 4:00 AM GMT
స్టూడియోలు కిక్కిరిసిపోయేంత ర‌ష్ ఉంద‌ట‌!
X
ఊహించ‌ని మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప్ర‌భుత్వాలు స‌డెన్ గా లాక్ డౌన్ లు ప్ర‌క‌టించాయి. ఈ ప‌రిణామం అనూహ్య‌మైన‌ది. ప‌ర్య‌వ‌సానంగా అన్ని ప‌రిశ్ర‌మలు ప‌ని నిలిచిపోయి తీర‌ని న‌ష్టంలోకి వెళ్లాయి. ముఖ్యంగా సౌత్ లోనే ఫుల్ స్వింగులో ఉన్న‌ టాలీవుడ్ ప‌రిస్థితి ఊహించ‌నంత ధైన్యంలోకి వెళ్లిపోయింద‌న్న‌ది ఓ అంచ‌నా. అయితే ఇంత కష్టంలోనూ ప్ర‌భుత్వాలు క‌నిక‌రించాయి. స‌డ‌లింపులు ఇచ్చాయి. తెలంగాణ ప్ర‌భుత్వం జూన్ నుంచి షూటింగుల‌కు అనుమ‌తులు ఇచ్చేయ‌డం.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కి వెసులుబాటు క‌ల్పించేయ‌డంతో ప‌రిశ్ర‌మ‌లో ఒక్క‌సారిగా హుషారు వ‌చ్చింది. ఎవ‌రికి వారు స‌రంజామాను సిద్ధం చేసుకుని సెట్స్ కెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆగిపోయిన షూటింగుల్ని తిరిగి ప్రారంభించే ఏర్పాట్ల‌లో ఉన్నారు. ఇప్ప‌టికే ఎవ‌రికి వారు షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి బహిరంగ ప్రదేశాలలో సహజ ప్రదేశాలలో షూట్ చేయడం అసాధ్యం కాబట్టి వాటిలో ఎక్కువ భాగం సెట్లను నిర్మించటానికి లేదా ఇండోర్ స్టూడియోస్ లో షూటింగులు చేసేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అన్న‌పూర్ణ ఏడెక‌రాలు స‌హా అల్యూమినియం ఫ్యాక్ట‌రీ.. రామానాయుడు స్టూడియోస్.. సార‌థి స్టూడియోస్ లో షూటింగుల‌కు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్ బృందం అల్యూమినియం ఫ్యాక్టరీలో పూణే సెట్ ‌ను నిర్మించడానికి రూ .5 కోట్లకు పైగా ఖర్చు చేయ‌నున్నార‌ని ప్ర‌చార‌మైంది. యూరప్ వెళ్లడం అసాధ్యం కనుక ప్రభాస్ త‌దుప‌రి షెడ్యూల్ ని ఇక్క‌డే సెట్లలో చిత్రీకరించాల్సి ఉంది. హైదరాబాద్ పరిసరాల్లోని స్టూడియోలలో కేవ‌లం తెలుగు సినిమాలే కాదు ఇరుగు పొరుగు భాష‌ల షూటింగులు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో స్టూడియోలు కిక్కిరిసిపోయే స‌న్నివేశం క‌నిపిస్తోంద‌న్న‌ది ఓ రిపోర్ట్. ఫిల్మ్ స్టూడియోలకు ఇప్పటికే రాబోయే నెలలకు భారీ డిమాండ్ పెరగ‌నుంది. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఒక్కొక్క‌రు భారీ అడ్వాన్సులు ఇచ్చి ఈ సంవత్సరం చివరి వరకు బుక్ చేస్తారని అంచ‌నా.

ప్రస్తుతం తుది దశలో ఉన్న ఆ చిత్రాల షూటింగ్ లకు పూర్తి చేసేయ‌డానికి టాలీవుడ్ నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాలు పూర్తయిన తర్వాత తదుపరి బంచ్ కు అనుమతి వ‌స్తుంది. ఆగస్టు నుండి థియేటర్లు తిరిగి ప్రారంభమవుతాయనే హోప్ తో పలువురు చిత్రనిర్మాతలు తమ చిత్రాలను దాసరా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుత సిట్యుయేష‌న్ మాత్రం స్టూడియో య‌జ‌మానుల‌కు క‌లిసి రానుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే తాజా ర‌ష్ ని దృష్టిలో ఉంచుకుని స్టూడియోల రెంట్లు పెంచేస్తే నిర్మాత‌పై అద‌న‌పు భారం ప‌డ‌డం ఖాయం. అయితే అలా కాకుండా పాత రెంట్ల‌నే కొన‌సాగిస్తారా? అన్న‌ది చూడాలి.