థియేటర్లు ఇక కళ్యాణ మంటపాలుగా..!

Thu Nov 25 2021 14:00:23 GMT+0530 (IST)

Theaters Are No Longer Wedding Halls

ఏపీలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. పంపిణీ వర్గాలు సహా ఎగ్జిబిటర్లలోనూ దీనిపై చర్చ వేడెక్కిస్తోంది. నిజానికి గడిచిన కొంత కాలంగా సినీరంగానికి ఏదీ కలిసి రావడం లేదు. అన్నిరకాలుగా సమస్యలున్నాయి. ఎగ్జిబిషన్ రంగం మరీ తీసికట్టుగా ఉంది. ఇలాంటి సమయంలో ఏపీలో ప్రభుత్వ నిర్ణయాలు మరింతగా ఇబ్బందికరంగా మారాయని ఒక సెక్షన్ విశ్లేషిస్తోంది. ఎగ్జిబిషన్ రంగంలో మెజారిటీ జనం దీనిపై సంతృప్తికరంగా లేరన్న టాక్ వినిపిస్తోంది. టికెట్ ధరల సవరణ.. ప్రభుత్వ పోర్టల్ వ్యవహారం కూడా ఎగ్జిబిషన్ రంగంలో పలు మార్పులకు కారణమవుతుందని విశ్లేషిస్తున్నారు.ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2600 పైగా థియేటర్లు ఉండేవి. ఇందులో సింగిల్ స్క్రీన్ల శాతం ఎక్కువగా ఉండేది. కానీ ఇటీవల 1400 కి ఆ సంఖ్య పడిపోయిందని గుసగుసలు వినిపించాయి. ఏపీలో థియేటర్లను కూల్చే వాళ్ల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. ఇప్పటికి ఉన్న థియేటర్లను కళ్యాణ మంటపాలుగా ఫంక్షన్ హాళ్లుగా మార్చేస్తున్నారు. ఇటీవల షాపింగ్ కాంప్లెక్సులు కట్టేందుకు అంతా ఆసక్తిగా ఉన్నారు. ఈ ప్రక్రియ చాలా కాలంగా సాగుతున్నా.. ఇటీవల అది మరింత పెరిగే దిశగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరికొత్తగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు ప్రకటనతో మునుముందు ఎగ్జిబిషన్ లో మార్పుల గురించి ఆందోళన వ్యక్తమవుతోంది.

సింగిల్ థియేటర్లను ఇప్పటికే చాలా వరకూ మూత వేసి తెరిచేందుకు ఇష్టపడని వాళ్లున్నారు. వీటి స్థానంలో కళ్యాణ మంటపాలు వెలసేందుకు పరిస్థితులు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. అలాగే కొత్తగా మల్టీప్లెక్సుల్ని నిర్మించే ఆలోచన ఏపీ వరకూ ఉండదని కొందరు చెబుతున్నారు. థియేట్రికల్ రంగంలో మెరుగుదల కావాలంటే ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు పెరగాల్సి ఉంటుంది. కానీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందన్న వాదనను ఒక సెక్షన్ వినిపిస్తోంది. మునుముందు ఏపీలో మల్టీప్లెక్స్ స్క్రీన్లు పెంచాలనే కార్పొరెట్ ఆలోచనకు విరుద్ధమైన సంకేతాలు అందాయని గుసగుస వినిపిస్తోంది.

ఇదేగాక.. థియేటర్లకు తడిసిమోపెడయ్యే కరెంట్ బిల్లులు.. ట్యాక్సులు .. కార్మిక భత్యాలు వగైరా వగైరా భరించలేమని ఎగ్జిబిటర్లు ఎప్పటినుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుముందు ఈ పరిస్థితుల్లో మార్పు చూడలేమని ఇప్పుడు ఆవేదన కనిపిస్తోంది. గత కరోనా సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నడూ లేని నష్టాలను ఎంతో కాలం చరిత్ర ఉన్న థియేటర్స్ శాశ్వతంగా మూతపడిపోవడం సినీ ప్రేమికులు ఇంకా జీర్ణించుకోనే లేదు. ఇంతలోనే కొత్త చట్టాలతో ఇబ్బంది ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు...గుంటూరు జిల్లా తెనాలిలో స్వరాజ్ అనే థియేటర్ మూతపడుతోందని తెలిసింది. ఇందులో క్లాసిక్ చిత్రాలెన్నో ఆడాయి. గుండమ్మ కథ- సువర్ణ సుందరి లాంటి సినిమాలు రికార్డులు నెలకొల్పాయి. ఇప్పుడు నష్టాల్ని తట్టుకోలేక ఈ థియేటర్ ని కూల్చేసి మాల్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ తరహాలో చాలా చోట్ల సింగిల్ థియేటర్లను తొలగించే ప్లాన్స్ ఉన్నాయని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.