ఊపందుకున్న షూటింగులు ఔట్ డోర్ లో స్టార్లు!

Thu Sep 23 2021 13:00:44 GMT+0530 (IST)

The shooting of Tollywood movies has gained momentum

కరోనా సెకెండ్ వేవ్ అనంతరం జనాలు ఇంకా థియేటర్ల బాట పట్టడం లేదు కానీ సినిమా స్టార్లు మాత్రం షూటింగుల బాట పట్టారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఇతర స్టార్ హీరోలు నటీనటులంతా ఇప్పుడు షూటింగులతో బిజీగా కనిపిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి తెలుగు స్టార్లు ఔట్ డోర్ షూటింగులతో బిజీగా ఉండటం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ రీమేక్ కోసం ఊటీ వెళ్లారు. తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇక నందమూరి బాలకృష్ణ కూడా ప్రస్తుతం గోవాలో ఉన్నారు. అక్కడే లైగర్ సినిమా షూటింగ్ కూడా జరుగుతూ ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇది వరకే నటించిన బాలకృష్ణ ఆ సాన్నిహిత్యంతో లైగర్ సెట్స్ ను కూడా సందర్శించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ సినిమా యూనిట్ ప్రకటించింది.

ఈ వార్తల నేపథ్యంలో.. టాలీవుడ్ సినిమాల షూటింగ్ లు ఊపందుకున్నాయని స్పష్టం అవుతోంది. ఒకరకంగా చెప్పాలంటే చాన్నాళ్ల తర్వాత ఈ మాత్రం ఊపు కనిపిస్తూ ఉంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ దగ్గర నుంచినే కొంతమంది స్టార్లు షూటింగులకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఫస్ట్ వేవ్ తర్వాత ప్రభుత్వమే షూటింగులకు పర్మిషన్లను ఇవ్వాల్సి వచ్చింది. అప్పట్లో ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ కొందరు సినిమా తారలు షూటింగులకు కదల్లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అనేక మంది స్టార్లు విదేశీ షూటింగులకు కూడా పయనం కావడానికి వెనుకాడం లేదు.

సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం వ్యాక్సినేషన్ ఊపందుకోవడం తారలు కూడా వ్యాక్సిన్లను వేయించుకోవడంతో.. ధైర్యంగా షూటింగులకు కదలుతున్నట్టుగా ఉన్నారు. మరోసారి వేవ్ విజృంభణలు ఏవీ లేకపోతే.. మళ్లీ పాత రోజులు మొదలైనట్టే ఇక అనుకోవచ్చేమో!